Poor people Land Encroached: తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట నల్లగుట్ట పరిధిలో 329 సర్వే నెంబర్‌లో 120 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. 2009 సంవత్సరంలో 61.22 ఎకరాల భూమిని నిరుపేదలకు డీకేటీ పట్టాల కింద పంపిణీ చేశారు. మరికొంత స్థలాన్ని క్రీడా మైదానానికి, పశువుల మేతకు వినియోగించుకునేందుకు పంపిణీ చేశారు. అయితే పట్టాలు పొందిన వారు డబ్బుల్లేక సొంతంగా ఇళ్లు కట్టుకోలేకపోయారు.
ఆ భూమి ప్రధాన రహదారికి దగ్గరగా ఉంది. ఇప్పుడు ధరలూ పెరిగాయి. ఇదే అదునుగా భావించిన స్థానిక వైఎస్సార్సీపీ నేతలు.. పేదలకు డీకేటీ పట్టాల కింద ఇచ్చి భూమిని ఆన్‌లైన్‌లో తొలగించారు. తర్వాత ప్రభుత్వ భూమంటూ ఆక్రమించేశారు. ముందుగా క్రీడా మైదానానికి కేటాయించిన ఒకటిన్నర ఎకరా స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించడం ప్రారంభించారు.
తమకు కేటాయించిన భూమిని మరొకరికి ఎలా అమ్ముతారంటూ డీకేటీ పట్టాలు పొందిన ప్రజలు.. వైఎస్సార్సీపీ నేతలను నిలదీశారు. ఎవరికి చెప్పుకుంటారో పొమ్మని బెదిరించిన నేతలు.. విక్రయాలు మాత్రం ఆపలేదు. స్థానిక తహశీల్దార్‌ని కలిసినా పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వైఎస్సార్సీపీ నేతల ఆక్రమణ నుంచి తమ భూమిని విడిపించాలని బాధితులు కోరుతున్నారు.
"ఈ భూమిని మాకు ఎప్పుడో ఇచ్చారు. కానీ డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేదు. ప్రస్తుతం కొంత మంది ఆ భూమిని చదును చేసి అమ్ముకుంటున్నారు. అడిగితే.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు". - బాధితురాలు
"120 ఎకరాల భూమిలో 50 నుంచి 60 ఎకరాలను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించారు. ఈ భూమిని పేదలకు పట్టాలు ఇచ్చారు. కానీ రాత్రికి రాత్రే.. దీనిని ఆక్రమించేశారు. ఒక్కొక్క ప్లాటుని అమ్ముకుంటున్నారు". - స్థానికుడు
ఇవీ చదవండి: