Rayalaseema YSRCP Leaders on Three Capitals: మూడు రాజధానులపై రాయలసీమ జిల్లాల్లో అధికార వైకాపా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై.. ఆ పార్టీ నేతల్లోనే భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ గర్జన తరహాలో సీమ జిల్లాల్లో తొలిసారిగా తిరుపతిలో "రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన" పేరుతో నేడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ఈ ప్రదర్శన తలపెట్టగా.. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం అలాంటి అవసరం లేదనడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రాయలసీమకు పరిపాలనా రాజాధాని అవసరం లేదని.. న్యాయ రాజధాని సరిపోతుందన్నారు.
ఇపుడు కాకపోతే ఇంకెప్పుడు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోరుకొనే వారంతా చేతులు కలపండి, అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు వంటి నినాదాలతో అధికార వైకాపా తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. రాయలసీమ పరిరరక్షణ సమితి, మానవవికాస వేదిక వంటి సంస్థలతో కలిసి తిరుపతి శాసనసభ్యుడు కరుణాకరరెడ్డి మహాప్రదర్శన చేపట్టారు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొందాం అంటూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు మూడు రాజధానులకు మద్దతుగా ముద్రించిన కరపత్రాల పంపిణీ చేపట్టారు.
శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమకు రాజధాని ఆవశ్యకత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మూడు రాజధానులకు ప్రజలు మద్దతు కూడగట్టడం ద్వారా వైకాపా ప్రయోజనాలు కాపాడే లక్ష్యంగా మహాప్రదర్శన సాగనుంది. ప్రజలను చైతన్యం చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణకు మద్దతు కూడగడతామని కరుణాకరరెడ్డి ప్రకటించారు.
"పోరాటలకు నిలయం రాయలసీమ. ఉద్యమాలకు నెలవు రాయలసీమ. రాయలసీమ గొంతు వినిపించటానికే తిరుపతిలో.. తిరుపతికి మాత్రమే, తిరుపతి ప్రజలకు మాత్రమే పరిమితి చేస్తూ.. రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శనను తొలి అంకురంగా ఆ మహా ప్రదర్శనను చేయ తలపెట్టాము". -కరుణాకరరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే
మూడు రాజధానులకు మద్దతుగా మహా ప్రదర్శనకు కరుణాకరెడ్డి సారథ్యం వహిస్తుంటే.. అలాంటి ప్రదర్శనలు అవసరమే లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భిన్నంగా స్పందించారు. రాయలసీమకు పరిపాలనా రాజధాని అవసరం లేదన్నారు.
"మా నాయకుడు, మా ముఖ్యమంత్రి రాయలసీమ జిల్లావాసి. మరీ రాయలసీమలోనే ఏదైనా స్పందన ఉంటుంది. తర్వాతే మిగతా ప్రాంతాలు. దానికి ప్రత్యేకంగా ఏం చేయావల్సినా అవసరం లేదు. అవసరమైనప్పుడు చేస్తాం". -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి
ఒకే పార్టీకి చెందిన ప్రముఖ నేతలు భిన్నంగా స్పందించడం ఆపార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. తిరుపతి నగరవాసులతో మాత్రమే మహాప్రదర్శన అని ప్రకటించినప్పటికీ సీమ జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు ర్యాలీలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: