Divya Darshan Tokens in TTD: మూడు సంవత్సరాల తర్వాత తితిదే దివ్యదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు.. సర్వ, ప్రత్యేక ప్రవేశ దర్శనాల భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా టోకెన్ల జారీ చేయనుంది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం.. సర్వదర్శన తరహాలోనే గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన పరిస్థితి రావడంతో తితిదే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు జారీ చేసే దివ్యదర్శనం టోకెన్లను తితిదే తిరిగి ప్రారంభిస్తోంది. కాలినడకన వచ్చే భక్తులు సాధారణ భక్తులతో పాటు దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండటం ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో 2017 సంవత్సరంలో దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు.
కాలినడకన వచ్చే భక్తులకు ప్రారంభ దశలో రోజుకు 20 వేల మందికి టోకెన్లు పంపిణీ చేసిన తితిదే క్రమంగా 25 వేల టోకెన్ల జారీ చేపట్టింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకొంటున్నారు. శ్రీవారి మెట్టు నుంచి వచ్చే వారికి పదివేలు, అలిపిరి నుంచి వచ్చే భక్తులకు 15 వేల టోకెన్లను జారీ చేశారు.
కరోనా మహమ్మారితో 2020 మార్చి 19 నుంచి దర్శన విధానాల్లో మార్పు చేసిన తితిదే.. దివ్యదర్శన టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేసింది. కరోనా నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనడం.. దర్శన విధానాలు అన్ని పునరుద్ధరణ చేయడంతో దివ్యదర్శన టోకెన్లను తిరిగి ప్రారంభించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది.
2017కు ముందు కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేసినా.. రద్దీ పెరిగి సర్వదర్శనం భక్తుల తరహాలోనే కంపార్టమెంట్లలో వేచి ఉండాల్సి వచ్చేది. సరికొత్త విధానంలో దర్శన సమయం కేటాయించి.. ఆ సమయానికి భక్తులను క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తు దివ్వదర్శన టోకెన్ల విధానాన్ని అమలు చేయడంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన ఇబ్బంది తొలగింది.
అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకొనే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొన్న తితిదే అధికారులు.. దివ్యదర్శన టోకెన్ల జారీకి చర్యలు చేపట్టారు. మూడు సంవత్సరాల పాటు దివ్యదర్శన టోకెన్ల జారీ నిలిపివేసిన తితిదే.. భక్తుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో ఉంచుకొని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది.
ఏప్రిల్ ఒకటి నుంచి.. అలిపిరి నుంచి తిరుమల చేరుకొనే భక్తులకు పదివేలు, శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులకు ఐదు వేలు చొప్పున టోకెన్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకొంది. మూడు సంవత్సరాల అనంతరం తిరిగి ప్రారంభించిన దివ్యదర్శనం టోకెన్ల జారీని ప్రాథమిక దశలో పదిహేను వేలు జారీ చేస్తున్నామని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. నెల రోజుల పాటు పరిశీలించిన అనంతరం టోకెన్ల సంఖ్య పెంచే అంశంపై నిర్ణయం తీసుకొంటామన్నారు
ఇవీ చదవండి: