Graduates MLC elections in AP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేశారు. అధికార పార్టీ నేతలు రెచ్చిపోయి తమకు అనుకూలమైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కోసం నమోదు చేశారు. దొంగఓట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడంతో టీడీపీ నేతలు స్పందించారు. దీంతో తిరుపతిలో బోగస్ ఓట్ల నమోదుపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో ఓట్లు పొందినవాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు.
నకిలీ ధ్రువపత్రాలతో పట్టభద్రుల ఓటు హక్కు: వైసీపీ నేతలే తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లపై తిరుపతి పడమర పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆధారాలను చూపిస్తూ దొంగ ఓట్లను పోలీసులకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో దొంగ ఓట్లున్నాయని పోలీసులకు ఆధారాలు చూపించామన్నారు. 6, 7వ తరగతి చదివిన వారు నకిలీ ధ్రువపత్రాలతో పట్టభద్రుల ఓటు హక్కును పొందారని ఆయన తెలిపారు. స్టాంపులను తయారుచేసి.. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ ఓట్లను నమోదు చేశారని ఆరోపించారు.
ఉద్యోగస్తులు త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్థి చెబుతారు: ఉద్యోగస్థులు, ఉపాధ్యాయులను మరోసారి నమ్మించి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తిరుపతి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను చర్చకు పిలిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్థి చెబుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని... రోజుకొక హత్య, అత్యాచారం జరుగుతోందన్నారు. జగన్ ప్రతి ఎన్నికను దౌర్బాగ్యమైన ఎన్నికగా మార్చాడని... ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి నగరంలోనే 15 వేలకుపైగా దొంగ ఓట్లను నమోదు చేశారని ఆరోపించారు. ఆధారాలతో పాటు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకెళ్లడం ఖాయమన్నారు. నకిలి ఓట్లపై తమ పార్లమెంటరీ బృందం రేపు ఎన్నికల కమీషన్ను కలుస్తుందని ఆయన తెలిపారు.
నకిలీ ఓట్ల వ్యవహరంపై సీపీఐ: వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి నియోజకవర్గంలోని నకిలీ ఓట్ల వ్యవహారాన్ని క్షేత్రస్ధాయికి వెళ్లి మీడియాకు వివరించారు. యశోద నగర్లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించడంపై నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు అంతులేకుండా పోతోందన్నారు. తిరుపతి నగరంలో 7వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి: