Sulabh workers strike: తిరుమలలో విధులు నిర్వహించే సులబ్ కార్మికులు రెండో రోజు విధులను బహిష్కరించారు. కార్మికులు విధులకు గైర్హాజరవడంతో పారిశుద్ద్య సమస్య తీవ్రమవుతోంది. మరుగుదొడ్లను శుద్ధి చేయడంతో పాటు వ్యర్థ పదార్థాల సేకరణలో కీలకంగా వ్యవహరించే కార్మికులు సమ్మె చేస్తుండటంతో తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. సులబ్ సంస్థ పరిధిలో పని చేస్తున్న దాదాపు రెండు వేల మంది కార్మికులు ఆకస్మికంగా విధులను బహిష్కరించడంతో సమస్య జఠిలమైంది. సులబ్ కార్మికులకు ప్రత్యామ్నాయంగా విధి నిర్వహణకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడానికి తితిదే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. సులబ్ కార్మికుల సమ్మెతో తిరుమలలో చెత్త భారీగా పేరుకుపోయింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో పారిశుద్ధ్య సమస్య తీవ్రమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సులబ్ సంస్థ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 1600 మంది కార్మికులు ఆకస్మికంగా సమ్మె బాట పట్టారు. రెండో రోజు కార్మికులు తమ నిరసన కొనసాగిస్తూ.. విధులకు దూరంగా ఉండటంతో తిరుమలలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తిరుమలలో భక్తుల వసతి గృహాలు, సముదాయాలు, కాటేజీలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను వివిధ సంస్థలు నిర్వహిస్తున్నాయి. స్వచ్చత, ఆల్ సర్వీస్, కల్పతరువు, శ్రీకృష్ణ, చైతన్య జ్యోతి సంస్థతో పాటు సులబ్ కాంప్లెక్స్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సులబ్ కాంప్లెక్స్ సంస్థ ద్వారా అన్నదాన సత్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలు, లడ్డు కౌంటర్లు, భక్తుల వసతి సముదాయాలు మూడింటితో పాటు, తిరుమలలోని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను సులబ్ కార్మికులు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా విధులను బహిష్కరించడంతో బహిరంగ ప్రదేశాల్లోని మరుగుదొడ్లలో నిర్వహణ కొరవడింది. చెత్త సేకరణ లేకపోవడంతో రహదారులపై చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. సులబ్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఇతర సంస్థలతో సమానంగా జీతాలతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించలేదని కార్మికులు వాపోతున్నారు.
లక్షల మంది భక్తులు వినియోగించే మరుగుదొడ్లను శుద్ధి చేస్తున్నా తమకు కనీస వేతనాలు అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీలక్ష్మి శ్రీనివాసా మాన్‌పవర్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు. సులబ్ కార్మికులు ఆకస్మిక సమ్మెకు వెళ్లడంతో టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని వివిధ పురపాలక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను తిరుమలకు తరలించారు. టీటీడీ పరిధిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రితో పాటు తిరుపతిలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులను కొంత మందిని తిరుమలకు తరలించారు. సమ్మె చేస్తున్న 1600 స్థానంలో దాదాపు వెయ్యి మందిని కార్మికులను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: