SCs Protest for Cremation Ground: తిరుపతి నగర శివార్లలోని తిమ్మినాయుడుపాలెం దళితులు ఆందోళనకు దిగారు. 300 కుటుంబాలు నివసిస్తున్న దళితవాడకు శ్మశానం లేకపోవడంపై నిరసన చేపట్టారు. దళితవాడకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని శ్మశానంగా వినియోగించుకోమంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడం లేదని ఆందోళన చేపట్టారు. ఖననం చేయడానికి స్థలం లేదంటూ మృతదేహన్ని రోడ్డుపై ఉంచి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు.
దళితుల నిరసనతో తిరుపతి-కడప ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా కూడా ఉన్నతాధికారులు వచ్చి.. తమ సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్థులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
తిమ్మినాయుడుపాలెం దళితవాడలో 900 మంది జనాభా ఉన్నారు. అంతమంది జనాభా ఉన్నా కూడా శ్మశానానికి స్థలం కేటాయించలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని వాపోయారు. అయినా అధికారులు తమ సమస్యను పరిష్కరించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. హరిజనవాడకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని శ్మశానంగా వినియోగించుకోవాలంటూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే అక్కడకు ఖననం చేసేందుకు వెళ్తే.. అనుమతి లేదని.. అటవీశాఖ అధికారులు తమను అడ్డుకుంటున్నారని వాపోయారు. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చి స్థలాన్ని కేటాయించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
"మా గ్రామంలో శ్మశాన వాటిక లేదు. గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు, 900 మంది జనాభా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో శ్మశాన వాటిక లేదని మేము రెవెన్యూ ఆఫీసర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. అయినా ఇప్పటికీ మా సమస్యకు పరిష్కారం కాలేదు. పైగా మా గ్రామంలో ఒకరు మృతి చెందారు. దహన కార్యక్రమాలు మేము ఎక్కడ చేసుకోవాలని తహసీల్దార్‌కు ఫోన్ చేసి అడిగాము. అయితే ఆ శవాన్ని మీరు మీ ఇంట్లో పూడ్చి పెట్టుకోండని ఆయన సమాధానం ఇచ్చారు. ఒక రెవెన్యూ అధికారి ఇలా అంటే.. మేము ఎవరితో మా గోడును వెల్లబుచ్చుకోవాలి?.." - తిమ్మినాయుడుపాలెం దళితవాడ వాసి
"రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్మశాన వాటికపై ఒక జీవో విడుదల చేసింది. దళితవాడల్లో శ్మశాన వాటిక లేకపోతే.. 45 రోజుల్లో వారికి కచ్చితంగా ఇవ్వాలని తెలిపింది. ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన జీవో నంబర్లను మేము కలెక్టర్ ఆఫీస్‌లో, స్పందనలో ఇచ్చాము. అయినా కూడా ఎవరూ మా గోడును పట్టించుకోవటం లేదు. మా సమస్య పరిష్కారం కావట్లేదు." - తిమ్మినాయుడుపాలెం దళితవాడ వాసి
ఇవీ చదవండి: