President Droupadi Murmu in AP: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె, ఆ తర్వాత అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరాన్ని సందర్శించారు. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థులు, క్రీడాకారులు, పొదుపు సంఘాల సభ్యులతో సమావేశమై భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో మార్గనిర్దేశం చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల పద్మావతి అతిథిగృహంలో బస చేసిన ముర్ము.. ఉదయాన్నే వరాహస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వేంకటేశ్వరుడి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి.. దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ధ్వజస్తంభానికి మొక్కిన రాష్ట్రపతి... ఆ తర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
గోతులాభారం: శ్రీవారి దర్శనానంతరం అలిపిరి చేరుకున్న రాష్ట్రపతి... సప్త గోప్రదక్షిణ మందిరాన్ని సందర్శించారు. ఆమెకు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికిన నిర్వాహకులు... స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. గోప్రదక్షిణ చేశాక... గోవులకు అరటిపళ్లు, మేత తినిపించారు. నూతన వస్త్రాలు సమర్పించారు. గోతులాభారంలో 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకోసం గోమందిరం అధికారులకు రాష్ట్రపతి 6 వేల రూపాయలు అందించారు.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: చివరిగా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో... విద్యార్థులు, మహిళా క్రీడాకారులు, పొదుపు సంఘాల సభ్యులతో రాష్ట్రపతి ముచ్చటించారు. చిన్న పని, పెద్ద పని అంటూ ఏదీ ఉండదని... అన్ని పనులనూ సమాన దృష్టిలో చూడాలని రాష్ట్రపతి అన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రశంసించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి: చివరిగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాత పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఛైర్మన్, ఈఓ రాష్ట్రపతికి ప్రసాదాలు అందజేశారు. శేష వస్త్రంతో సత్కరించారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి దిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఇవీ చదవండి: