Benefits of Rosemary : రోజ్‌మేరీ- పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన, అందమైన చిన్న పొద ఇది. దీనిని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా ఉపయోగిస్తారు. ప్రధానంగా నాన్‌వెజ్ రెసిపీల్లో, బ్రెడ్-సూప్స్ తయారీలో, సలాడ్లలోనూ దీన్ని విరివిగా వాడతారు. దీంతో హెర్బల్ టీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ నేపథ్యంలో రోజ్‌మేరీతో కలిగే లాభాలను తెలుసుకుందాం.
రోజ్ మేరీతో లాభాలు :
- రోజ్ మేరీ ఆకుల వాసన ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ అందిస్తుంది. కాసేపు ఈ సువాసన పీల్చడం వల్ల ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- రోజూ 4 నుంచి 10 నిమిషాలు ఈ వాసన పీల్చడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- రోజ్ మేరీ వాటర్ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే కడుపుబ్బరం తగ్గుతుంది. ఇంకా ఊబకాయం రాదట.
- మన శరీరానికి సి-విటమిన్ అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నోటిపూత రాదు.
- రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ తగ్గుతుందట.
- ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలున్నాయి.
- మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- కళ్లకు రక్షణ ఇస్తుంది. ఇంకా చూపు మెరుగవుతుంది. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణలు చెబుతున్నారు.
రోజ్ మేరీ వాటర్ ఇలా చేయాలి :
కావాల్సిన పదార్థాలు :
- నీళ్లు - లీటరు
- 3 రోజ్‌మేరీ రెమ్మలు
- 2 నిమ్మ చెక్కలు
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో లీటర్ నీళ్లు పోయండి. ఇందులో రోజ్‌మేరీ రెమ్మలు, నిమ్మ చెక్కలు వేయండి.
- ఆపై దీనిని రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం వడకట్టేసి తాగితే సరిపోతుంది.
పెంచడం ఈజీ!
బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటి సన్నని ఆకులతో, సువాసన గల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది రోజ్‌మేరీ మొక్క. సుమారు మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగే చిన్నపొద ఇది. నీరు నిలవని ఇసుక నేలల్లో, చల్లటి వాతావరణంలో ఈ మొక్క చక్కగా పెరుగుతుంది. రోజ్‌మేరీ మొక్కకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రకాశవంతమైన వెలుతురు ఉండాలి. అలాగని ఎండ తీవ్రత అధికంగా ఉండకూడదు. ఈ మొక్క నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఇంట్లో సూటిగా ఎండ పడని చోట నాటుకుంటే సరిపోతుంది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపిట్ పాళ్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇక సమ్మర్లో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రకాలు రెండు- వాడకం ఒకటే!
ఈ మొక్క నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండుదైనా వంటల్లో ఉపయోగిస్తారు. ఆకు కోసేటప్పుడు గ్రీవం పైన తుంచుకుంటే చిగుళ్లు ఫాస్ట్‌గా వస్తాయి. దీనిని నచ్చిన ఆకృతిలో కట్ చేసుకోవచ్చు. ఒకసారి నాటిన రోజ్‌మేరీ మొక్క ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటుంది. ముఖ్యంగా రోజ్‌మేరీలో 2 రకాలు ఉంటాయి. ఒక మొక్క పొదలాగా పెరిగితే, మరొకటి కొద్దిగా తీగలాగా సాగుతుంది. రెండో రకం రాక్ గార్డెన్లలోనూ, వేలాడే తోటల్లోనూ పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. వంటలకు మాత్రం రెండూ ఒకే రకమైన టేస్ట్‌ని అందిస్తాయి.
ఘాటైన "వెల్లుల్లి రసం" - వేడివేడి అన్నంతో తింటే జలుబు, పొడిదగ్గు నుంచి రిలీఫ్!
షాపింగ్ చేసినపుడు ఎందుకు సంతోషంగా ఉంటుందో తెలుసా? - ప్రశంసలకూ అదే కారణమట