Samara sankharavam program by the sarpanchs in Tirupati: గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించడాన్ని నిరసిస్తూ.. సర్పంచులు.. సమర శంఖారావం పేరుతో చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.బి.రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో.. సర్పంచులు తిరుమల శ్రీవారికి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చారు. అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించిన సర్పంచులను.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి అలిపిరిలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ఉండటాన్ని గమనించిన సర్పంచులు... రుయా ఆసుపత్రి ఆవరణలో గుమికూడారు. అక్కడి నుంచి నడుచుకుంటూ అలిపిరి వెళ్లేందుకు యత్నించారు. అలిపిరి నుంచి రుయా ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు... అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సర్పంచులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల హడావుడి, సర్పంచుల అరెస్టులతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్పంచులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆటోలు, వ్యాన్‌లలో.. అలిపిరి, రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
సమస్యలను తిరుమలేశుడికి విన్నవించుకునేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమర శంఖారావం కార్యక్రమాన్ని పూర్తిచేసి తీరతామని సర్పంచులు తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: