Lokesh 25th day Padayatra: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 25వ రోజు స్వల్పఉద్రిక్తతల మధ్య సాగింది. జీలపాలెం విడిది కేంద్రం నుంచి ప్రారంభమెన పాదయాత్ర గాజులమండ్యం చేరుకొగానే ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తెదేపా జెండాలను తొలగిస్తూ చరవాణులలో దృశ్యాలు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. తెదేపా కార్యకర్తలు అడ్డుకోవడంతో తాము రెవెన్యూ అధికారులమని తెలిపారు. ఆ సమయానికి ఆ ప్రాంతానికి చేరుకున్న లోకేశ్ తెదేపా కార్యకర్తలకు సర్ధిచెప్పి ముందుకు సాగారు. రేణిగుంట నుంచి తిరుపతి నియోజకవర్గంలోకి పాదయాత్ర చేరింది. పాదయాత్ర తిరుపతికి చేరుకోగానే తెలుగు యువత, తెదేపా శ్రేణులు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.
పాదయాత్రలో భాగంగా రేణిగుంట వై కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఆర్ఎంపీలకు కావాల్సిన వైద్య పరికరాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. 429 జివోలో సవరణలు తీసుకొచ్చి అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తానన్న జగన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క సమస్య అయినా పరిష్కరించారా అని ప్రశ్నించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి దృవీకరణ పత్రాలు అందజేస్తామని.. ఐఎంఏ డాక్టర్లతో ఇబ్బంది లేకుండా ఇరువర్గాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు సమస్యలు పరిష్కరించేలా ఖచ్చితమైన హామీలు ఇస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్ది కమిటీల్లో ఆర్ఎంపీలకు అవకాశం కల్పించడంతో పాటు.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు.
108, 104 పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం.. హాస్పిటళ్లలో మందులు లేవు. బ్యాండేజ్ కరవు.. ఎవరైనా వైద్యం కావాలని వస్తే.. అవన్నే తెచ్చుకోండి చేస్తాం అనే పరిస్థితి దాపురించింది. అంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం. 429 జీవోకు సవరణలు చేసి తీసుకువస్తాం. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుదాం. - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
పాదయాత్రలో భాగంగా రేణిగుంటలో యాదవ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వైకాపా పాలనలో యాదవుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది సున్నా అని ఆయన ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాక ముందు బహిరంగ సభలు అన్ని రోడ్ల మీదే పెట్టాడని లోకేశ్ గుర్తు చేశారు. జగన్ పాదయాత్రలో 9 మంది చనిపోయారని.. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు నా పాదయాత్రకు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. బీసీల సంక్షేమానికి ఎవరు ఎంత ఖర్చు చేశారో తాను చర్చకు సిద్దమని.. వైకాపా నేతలు సిద్దమా అని ప్రశ్నించారు. తెదేపా బీసీ సబ్ ప్లాన్ తెస్తే.. వాటి నిధులు పక్కదారి పట్టించిన ఘనత వైకాపాకి దక్కిందన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. దామాషా ప్రకారం యాదవులకు రావాల్సిన నిధులు కేటాయించి... ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రేణిగుంట మండలం జీ పాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర తిరుపతి అంకుర ఆస్పత్రి సమీపంలోని విడిది కేంద్రం వరకు సాగింది. రాత్రికి తిరుపతిలోనే బస చేశారు. శుక్రవారం యువతతో నిర్వహించనున్న హలో లోకేశ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి :