NARA LOKESH YUVAGALAM PADAYATRA : రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. యువతను మోసం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లి వద్ద యువతతో లోకేశ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన కాలపరిమితితో నియామక ప్రక్రియ చేపడతామన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేశామన్న లోకేశ్.. అనంతపురం జిల్లాలో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల పాలు జేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు.
మైనస్ నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి: రాష్ట్ర విభజనతో 2014లో సున్నా స్థాయి నుంచి అభివృద్ధి చేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు జగన్ పాలనతో మైనస్‌కు చేరుకుందని విమర్శించారు. ఇప్పుడు మైనస్ నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. జగన్‌కు క్రీడలు అంటే పబ్జీ మాత్రమే తెలుసని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అభివృద్ధి చేస్తామన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందని.. గూగుల్‌లో సెర్చ్ చేస్తే గంజాయి రాజధాని ఆంధ్రప్రదేశ్ వస్తుందని విమర్శించారు.
లోకేశ్ పాదయాత్ర @ 400 కిలోమీటర్లు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 31వ రోజు కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గం గాదంకి టోల్గేట్ నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు ముందు క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం అనంతరం లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. గాదంకి, నేండ్రగుంట మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్ర నేండ్రగుంటకు చేరుకునే సరికి 400 కిలోమీటర్లు పూర్తవ్వడంతో శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు.
పాకాల మండలంలోని నరేంద్రకుంటలో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసే 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్ర కుంటలో పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు ద్వారా నరేంద్రకుంట పరిసర ప్రాంత ప్రజల వైద్యం కోసం పడే వ్యయ ప్రయాసలు తగ్గుతాయన్నారు. 400 కిలో మీటర్లు పూర్తైన సందర్బంగా ఆస్పత్రి నిర్మాణం చేపడతామని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: