CPI Ramakrishna On Pending Irrigation Projects: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా తిరుపతిలోని పార్టీ కార్యాలయం నుంచి రేణిగుంట సమీపంలోని గాలేరు-నగరి సృజల స్రవంతి ప్రాజెక్ట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాలేరు-నగరి సుజల స్రవంతి అంతర్భాగమైన జలాశయం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని నినాదాలు చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు, సాగునీటి అధికారులు పారిపోతున్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. ఈ నెల 20న పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు ఉత్తరాంధ్రలోని పలాస వరకు పెండింగ్ ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. విజయవాడలో రాజకీయ పక్షాలతో పెండింగ్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నివేదిక తయారు చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. కర్ణాటకలో అనుమతుల్లేని ఎగువభద్ర ప్రాజెక్ట్ కడుతున్నా జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లన్నీ పర్యటిస్తున్నాం, పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర పలాస వరకు మా యాత్ర ఉంటుంది. ఎక్కడా పనులు లేవు, ఎక్కడ చూసిన స్టాండ్ స్టీల్. కాంట్రాక్టర్లకు రావలసిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇలాంటి అన్ని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని మేము పూనుకున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజలు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి కలిసికట్టుగా సమైక్య ఉద్యమానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: