Cheetahs roam at Sri Venkateswara University: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుతలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయనీ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బందించాలని విద్యార్థులందరూ తరగతులు బహిష్కరించి, ఆందోళనకు దిగారు. ఏడాదిన్నర కాలంగా విశ్వవిద్యాలయంలో చిరుతలు సంచరిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని వాపోయారు.
ఆదివారం రాత్రి విశ్వవిద్యాలయం ఉప కులపతి బంగ్లా వద్ద పెంపుడు కుక్కను చంపడంతో అందరిలో భయాందోళన ఎక్కువయ్యిందన్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై విశ్వవిద్యాలయంలో స్వేచ్ఛగా తిరుగుతున్న చిరుతలను బంధించాలని కోరారు.
ఇటీవల విశ్వవిద్యాలయం ఆవరణలోని పశువైద్య బోధనాసుపత్రి, బాలురు, బాలికాల వసతి గృహం వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామని అక్కడి భద్రత సిబ్బంది తెలిపారు. గత ఏడాది కాలంలో 15కు పైగా కుక్కలు ఈ ప్రాంగణం నుంచి అదృశ్యం కావడం విశేషం. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఉపయోగం లేదని అధికారులు అంటున్నారు.
ఉప కులపతి నివాసానికి 8 అడుగుల ప్రహరితో పాటు ఇనుప కంచెను ఏర్పాటు చేశామని, అయినా కూడా చిరుతలు లోపలికి వచ్చి పెంపుడు కుక్కను చంపి తీసుకెళ్లాయని.. విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మనాభ రెడ్డి అన్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి