Chandrababu Fire on YSRCP Leaders : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాలు, అక్రమాలతో దోచుకున్న డబ్బును యథేచ్ఛగా పంపిణీ చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన హైదరాబాద్ వెళ్తూ చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నానిని పరామర్శించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో సందడి వాతావరణంలో జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి గ్రామదేవతలు సత్యమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్, నందమూరి కుటుంబసభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూరనాయుడు సమాధులకు చంద్రబాబు నివాళులు అర్పించి వస్త్రతర్పణం చేశారు. తన నివాసం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు.
వేలసంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు - ఏకంగా పోలింగ్ బూత్‌లు మార్చేశారు: చంద్రబాబు
నారావారిపల్లెలో స్థానికులు, తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలపై నిరసనలో భాగంగా ఆత్మహత్యకు యత్నించి అస్వస్థతకు గురైన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులిపర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న సొమ్మును పంపిణీ చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడినవారిని వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు. పులివర్తి నానిని పరామర్శించిన అనంతరం రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.
కలిసి భోజనం చేసిన చంద్రబాబు, పవన్- సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై కీలక మంతనాలు
"ఎక్కడ చూసిన దొంగ ఓట్లు చేర్పించడం. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను తీసివేయడం. ఫారం - 6, 7, 8 లను విచ్చల విడిగా ఉపయోగించారు. కరుడుగట్టినా నేరస్థులు, ఉగ్రవాదుల కన్నా దారుణంగా చేస్తున్నారు. రేపు అనేది లేదనుకుని బరితేగించారు. నాని చేసే పోరాటం ధర్మపోరాటం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే పోరాటమిది." - చంద్రబాబు
కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు