Srikalahasteeshwara temple: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆగమ యోక్తంగా జరుపుతున్నారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సంధ్యా సమయంలో నిర్వహించే ఈ ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మూగజీవాలకు ముక్తిని ప్రసాదించి నవగ్రహాలు, 27 నక్షత్రాలు కవచంగా ధరించి ఉన్న వాయు లింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం అంటే ఆది నుంచి ప్రత్యేకమే. ముఖ్యంగా కార్తీక మాసంలో జరిగే ఈ ఆకాశ దీపోత్సవాన్ని వీక్షిస్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయిని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సాయంత్రం వేళలో ఈ ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ అద్భుత ఘటనే దర్శించుకున్న వారిపై పార్వతీ పరమేశ్వరుల కరుణ కటాక్షాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. రాహు కేతు సర్ప దోష నివారణ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకున్న భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకోవడానికి దేశ నలమూల నుంచి వచ్చే భక్తులకు ఆకాశదీపం కనువిందు చేస్తుంది.
ఇవీ చదవండి: