దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 71వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో వైఎస్ఆర్ విగ్రహానికి మాజీమంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. వైఎస్ఆర్కు జిల్లాతో ఉన్న అనుబంధం వెలకట్టలేనిదని... తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, నాయకులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, వైకాపా ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైకాపాతోనే సాధ్యమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏఎంసీ మాజీ అధ్యక్షులు వీరభద్రరావు, ఎంపీడీవో జయంతి ప్రసాద్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పాతపట్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
నరసన్నపేటలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆధునీకీకరణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు.