మహిళల అభున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే వైఎస్‌ఆర్ ఆసరా పథకం ప్రారంభించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దూరదృశ్య సమావేశం ద్వారా శుక్రవారం ప్రారంభించారు. దీనిపై శ్రీకాకుళం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు హాజరయ్యారు.
పథక ప్రారంభోత్సవం అనంతరం స్పీకర్ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఇది పండగ రోజని, 88 లక్షల మందికి మహిళల నమ్మకాన్ని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రిదని కొనియాడారు. మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు దక్కాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. అందులో భాగంగానే అమ్మఒడి, వైఎస్‌ఆర్ కాపునేస్తం, వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ సున్నావడ్డీ, వైఎస్‌ఆర్ భరోసా, వైఎస్‌ఆర్ రైతు భరోసా తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు తమ్మినేని చెప్పారు.