Dissent in Palasa YCP: మొన్న సత్యసాయి, నిన్న నెల్లూరు, నేడు శ్రీకాకుళం ప్రాంతాలు మారినా వైసీపీలో అసమ్మతి సెగలు మాత్రం తగ్గడం లేదు. రోజుకు ఏదో ఒక చోట వైసీపీ నేతలు తమ స్వంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అసమ్మతి స్వరాలు మంత్రి సీదిరి అప్పలరాజు సీటుకు ఎసరు పెట్టేలా ఉన్నాయి. మంత్రిపై ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు మాత్రమే ఆరోపణలు చేస్తూ వస్తుండగా.. నేడు ఆయన స్వంత పార్టీ నేతలే మంత్రిపై ఆరోపణలు చేసిన సందర్భంగా.. అధిష్ఠానం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో అన్నే అంశం సర్వత్రా ఆసక్తిని రేపుతుంది.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి నేతలు.. మంత్రి అప్పలరాజుకు గత కొన్ని రోజులుగా నిద్ర పట్టకుండా చేస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ నేతలు కబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తుండగా... ఇప్పుడు స్వంత పార్టీకి చెందిన నేతలే ఆరోపణలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అసమ్మతి నేతలు దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠం ఆరోపణలపై స్పందించారు.
పార్టీని కాపాడు కోవాల్సిన బాధ్యత తమపై ఉందని, తమ పార్టీ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై నిజ నిర్దారణ కమిటీ వేసి, గ్రామాల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. ఆ నివేదికను జిల్లా నేతలతో పాటు సీఎం జగన్కు పంపిస్తామని వెల్లడించారు. నేడు పలాసలో దువ్వాడ హేంబాబు చౌదరి కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలోనే అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. పార్టీలోని కొందరు నేతలపై వస్తున్న విమర్శలుపై అసహనం వ్యక్తం చేశారు.
'పలాస నియోజకవర్గంలో వైసీపీపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు కారణాలపై మేము ఓ నిజనిర్దారణ కమిటీ వేసి ప్రతి గ్రామానికి వెళ్తాం. వైసీపీలో ఎవ్వరూ అవినీతి చేసినా.. అది మా పార్టీకి ఇబ్బందే అందుకోసం ప్రతి గ్రామానికి వెళ్లేందు ప్రయత్నిస్తాం. వారు చెప్పె సలహాలు సూచనలు తీసుకుంటాం. జగన్ గారు 2011 నుంచి ఇప్పటివరకు పార్టీ తరఫున ఎలాంటి పిలుపు ఇచ్చినా చేశాం. మా పార్టీలో అవినీతి జరగకుడండా చూడటం కోసమే మేమంతా గ్రామాల్లో ప్రయత్నిస్తాం. అవినీతి జరిగినట్లు తెలిస్తే.. ఆ వివరాలు జిల్లా నాయకులతో పాటుగా... మా అధినేత జగన్కు సైతం వివరాలు పంపిస్తాం.'- పలాస వైసీపీ నేతలు
ఇవీ చదవండి: