రైతుల ప్రయోజనాలపై తెలుగుదేశం ఏనాడూ వెనక్కు తగ్గలేదని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో వైకాపా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని పార్లమెంటులో స్పష్టంగా చెప్పామని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో ఒకలా, బయట మరొకలా మాట్లాడేది వైకాపానే అని విమర్శించారు. మార్కెట్ రుసుం, సెస్‌లను రాష్ట్రాలు వసూలు చేయకుండా కొత్త వ్యవయసాయ చట్టాలు నిషేధిస్తాయని ఆనాడే చెప్పామన్నారు. మార్కెట్ వ్యవస్థ కుప్పకూలుతుందని రైతులు కార్పరేట్ రంగం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని కేంద్రానికి వివరించామని ఆయన తెలిపారు. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతు ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు.
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలుగుదేశంపై దుష్ప్రచారం చేస్తున్నారని రామ్మోహన్ విమర్శించారు. చట్టంపై చర్చించేటప్పడు పార్లమెంటులో వైకాపా నేతలు నిద్రపోయారేమోనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తెదేపా పోరాటం చేసే వరకు బీమా ప్రీమియం చెల్లించలేదన్న రామ్మోహన్... రాత్రికి రాత్రి జీవోలు జారీ చేసి తాము ఎప్పుడు కడితే ఏంటని ప్రశ్నించడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. ఏడాదిన్నరగా రైతులకు ఒక్క రూపాయి కూడా బీమా సొమ్ము చెల్లించకపోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పరికరాల మీద సబ్సిడీని ఎత్తేసి రైతు ద్రోహిగా జగన్ ప్రభుత్వం మిగిలిపోయిందని ఆక్షేపించారు.
ఇదీ చదవండి