శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక మురళీనగర్ కాలనీలో జరిగిన దాడిలో.. రెండేళ్ల బాలుడు ప్రవీణ్ మృతి చెందాడు. రోడ్డుమీద ఆటో పెట్టడంపై జరిగిన గొడవే చిన్నారి మరణానికి కారణమని స్థానికులు తెలిపారు. పండుగ సందర్భంగా అక్క నక్కన పార్వతి ఇంటికి వచ్చిన సంతోషి కుటుంబ సభ్యులు ఆటోను రహదారి పక్కన పెట్టారని వెల్లడించారు. ఇంతలో పక్కింటి వడ్డి కామయ్య ద్విచక్ర వాహనంపై రాగా.. రోడ్డుపై ఆటో ఎవరు పెట్టారని గొడవకు దిగాడని పేర్కొన్నారు.
కుమారుడే లోకంగా..
మూడేళ్ల క్రితం బాలుడి తల్లి సంతోషికి వివాహం కాగా.. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఆమె బాబుతో కలిసి పుట్టింటికి వచ్చి ఉంటోంది. అక్క ఇంటి వద్ద గొడవ జరుగుతుండగా బాబుని తీసుకుని ఇంట్లోకి వెళుతున్న సమయంలో.. వడ్డి కామయ్య ఒక్కసారిగా కర్రతో దాడి చేశాడు. బాలుడి తలకు బలమైన గాయం కాగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో.. ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఘర్షణలో నక్కన పార్వతికీ తీవ్రగాయాలయ్యాయి.
పరారీలో నిందితుడు...
గొడవకు కారణమైన వడ్డి కామయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై డీఎస్పీ మహేంద్ర విచారణ చేపట్టారు. బాలుడు మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ, ఎస్సైలు తెలిపారు.
ఇదీ చదవండి: