BJP LEADERS RESIGN THEIR POSTS : రాష్ట్ర బీజేపీ నేతల్లో అసంతృప్తి స్వరాలు బయటకొస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆరు జిల్లాలకు నూతన అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకాల్లో పలు మార్పులు చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి జిల్లా), కృష్ణా, నరసరావుపేట(పల్నాడు జిల్లా), ప్రకాశం జిల్లాలకు నూతన అధ్యక్షుల నియామకాలు చేశారు. ఈ ఆరు జిల్లాలకు పని చేసిన అధ్యక్షులను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించారు. దీనిపై అధికారికంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నుంచి లేఖ బయటకొచ్చింది.
ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా.. శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న చిగురుపాటి కుమారస్వామి పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ రాశారు. జిల్లా అధ్యక్షుల మార్పుపై ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. ఇది రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఏనాడూ లేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలకు నిరసనగా తన బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.
మరో సీనియర్ నాయకుడు, రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ తుమ్మల ఆంజనేయులు సైతం తన బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు వీర్రాజుకు లేఖ రాశారు. గతంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక పార్టీ బాధ్యతలలోనూ, ఏబీవీపీలోని అనేక స్థాయిలలో పార్టీ కోసం పని చేసినట్లు లేఖలో ప్రస్తావించారు.
ఇంతపెద్ద నిర్ణయంపై కోర్ కమిటీలో కనీసం చర్చ జరగకపోవడం.. జీర్ణించుకోలేని విషయమన్నారు. జిల్లా అధ్యక్షుల మార్పు నుంచి గత రెండు, మూడేళ్లలో పార్టీలో తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలు చేసిన తీరుకు విసుగు చెంది తన బాధ్యతల నుంచి బాధతో తప్పుకుంటున్నట్లు ఆంజనేయులు తన లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: