పురపాలక ఫలితాలతో వైకాపా శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఈ విజయం ప్రజలందరిదని సీఎం జగన్ అన్నారు.
ఈ విజయం అందరిది: జగన్
విజేతలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ గొప్ప విజయం అందరిదని అన్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకం, బాధ్యత మరింత పెరిగాయని చెప్పారు. ప్రజలకు మరింత మేలు చేసేందుకు ఓ కుటుంబసభ్యుడిగా తాపత్రయపడతానని స్పష్టం చేశారు.
శ్రీకాకుళంలో విజయోత్సవాలు..
రాష్ట్రంలో పురపోరు ఏకపక్షమైందని.. సీఎం జగన్ పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వికేంద్రీకరణ కోరుకుంటున్నారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో విజయోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు.
రాజధాని వికేంద్రీకరణ అనివార్యం..
పుర ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ అనివార్యమని మంత్రి కొడాలి నాని పునరుద్ఘాటించారు. అమరావతి రైతులు.. తమకేం కావాలో ఓ ఎజెండాతో వస్తే ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
విజయవాడ మేయర్‌ను ముఖ్యమంత్రే నిర్ణయిస్తారు..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ మేయర్‌ను ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని చెప్పారు. ఈ ఫలితాలు చూసైనా ప్రతిపక్షాలు వాస్తవాలు గ్రహించాలని మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు. అలాగే ఈ విజయంతో ప్రతి సంక్షేమ పథకాన్నీ ప్రజలకు చేరవేసేందుకు మరింత కృషి చేస్తామని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు.
గుంటూరులో సంబరాలు
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిందని మద్యవిమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా విజయాన్ని పురస్కరించుకుని.... గుంటూరు మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రజల ఇచ్చిన తీర్పువైకాపా పాలనకు నిదర్శనమన్నారు.
గుంటూరులోవైకాపా తరపున గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. వైకాపా శ్రేణులు టపాసులు కాల్సి సంతోషాన్ని పంచుకున్నారు. అభివృద్ధిని, సంక్షేమ పథకాల్ని చూసి గుంటూరు ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు.
విశాఖలో ఉత్సవాలు
మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో.. నగరంలో ఆ పార్టీ విజయోత్సవాలు మిన్నంటాయి. ప్రధానంగా ఉత్తర నియోజకవర్గం లోని 17 వార్డులకు గాను 15 వార్డుల్లో వైకాపా విజయం సాధించడంతో... ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున విజయోత్సవం నిర్వహించారు.
బాధ్యత మరింత పెరిగింది
మున్సిపాలిటీలో ఘన విజయం సాధించామని, అయితే ఈ గెలుపుతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందని ఎమ్మెల్యే రజిని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తామని పట్టణ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడంలో ఇక ముందు కూడా కృషి చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: