శ్రీకాకుళం పట్టణానికి చెందిన సమీరా తన పదో ఏటనే టెన్నిస్ రాకెట్ చేత పట్టింది. పదకొండేళ్లకే జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణం సాధించి సత్తా చాటింది. ఖమ్మంలో 2010లో నిర్వహించిన సౌత్‌జోన్ పోటీలలో సింగిల్స్, డబుల్స్ విభాగాలల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. నిరంతర సాధనతో సమీరా జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతోంది. రాష్ట్రస్థాయిలో జేఎన్‌టీయూకి సారథిగానూ వ్యవహరించింది. జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు సొంతం చేసుకుంది. గ్రాండ్ స్లామ్ స్థాయికి ఎదగాలనుకుంటున్న సమీరా తమకు సరైన వసతులు సమకూర్చాలని కోరుతోంది.
సమీరా.. రికార్డులు
కాకినాడలో జరిగిన ఆలిండియా జాతీయస్థాయి సీనియర్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో డబుల్స్‌లో తృతీయ స్థానం సాధించింది. 2018లో జరిగిన జాతీయస్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్లో 92వ స్థానం.. విజయవాడలో 2018లో జరిగిన ఆలిండియా జాతీయ స్థాయి సీనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో డబుల్స్‌లో తృతీయ స్థానం వరించింది. జాతీయస్థాయి మహిళా విభాగం 2017లో నిర్వహించిన పోటీల్లో ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2017లో రాష్ట్ర స్థాయి మహిళా విభాగం పోటీల్లో ప్రథమ స్థానంలో నిలబడింది. విశాఖపట్నంలో 2017లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో అండర్-18 విభాగంలో డబుల్స్ విజేతగా నిలిచింది. రాష్ట్ర స్థాయి విశిష్ట పురస్కార గ్రహీతగా 2017లో అవార్డు అందుకుంది. ఇలా చాలా పోటీల్లో సమీరా ప్రతిభ కనబరిచింది.
ఎప్పుడూ ఒంటరి పోరాటమే
లాన్ టెన్నిస్‌లో ఎంత ఎత్తుకు ఎదిగినా సమీరా ఎప్పుడు చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఎల్లప్పుడూ ఒంటరిగా పోరాటం చేస్తోందని తనకు తాము ఎప్పుడు సహకారం అందించలేకపోయామంటున్నారు. ఆమె కచ్చితంగా మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తింపు క్రీడాకారులను ఓడించగలదు
వ్యక్తిగత క్రమశిక్షణ, కఠోర సాధనే సమీరాను ఈ స్థాయికి ఎదిగేలా చేశాయని ఆమె చీఫ్ కోచ్ అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటివరకు చూసిన క్రీడాకారులలో సమీరానే మంచి ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడగల క్రీడాకారిణి అని ఆయన పేర్కొన్నారు. కోర్టులో చాలా చురుకుగా కదులుతుందని, చాలా గుర్తింపు ఉన్న క్రీడాకారులను సైతం ఆమె ఓడించగలిగిందని ఆయన వివరించారు. స్పాన్పర్స్ దొరికినా, దొరక్క పోయినా ఈ సంవత్సరం మరిన్ని జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని కోచ్ తెలిపారు.
ఆర్థిక పరిస్థితులు అంతంతే
గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా శ్రమిస్తున్న సమీరా కనీస సౌకర్యాలు లేని జిల్లా మైదానంలోనే ప్రాక్టీసు చేస్తోంది. సింథటిక్ కోర్టులపై ఆడేందుకు విశాఖకు వెళ్లి వస్తోంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తన సాధనను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు ఈ శ్రీకాకుళం సంచలనం.
గ్రాండ్‌స్లామ్.. లక్ష్యం
'నేను స్కూలు స్థాయి నుంచే టెన్నిస్ ఆడటం ప్రారంభించాను. మొదట అదనపు యాక్టివిటీగానే నేర్చుకున్నా.. తరువాత దీనినే కెరీర్‌గా ఎంచుకున్నాను. భవిష్యత్తులో గ్రాండ్ స్లామ్ స్థాయికి ఎదగాలనుకుంటున్నాను’’ అని సమీర అంటోంది.
ఇదీ చదవండి: 'టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా అతడికే ఉంది'