శ్రీకాకుళంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెంచిన కరెంట్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ ఏడు రోడ్ల కూడలిలో మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలంతా కష్టాలలో ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచి పేదలకు ఇబ్బంది పెట్టడం మరింత అన్యాయమని అన్నారు. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలపై వైకాపా ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపడితే సహించబోమని... తెదేపా ప్రభుత్వం ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేశారు. దీక్షలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ పెంచిన ఛార్జీలు తగ్గించాలని.. పేదవారిపై విద్యుత్ భారం మోపవద్దని వారు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు.