కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై మరోసారి పునరాలోచన చేయాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. దేశ వ్యాప్తంగా రైతుల నిరసన గళాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెదేపా ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మిదేవి, బగ్గు రమణమూర్తితో కలిసి రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం డీఆర్వో దయానిధికి వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల్లో మద్దతు ధరపై స్పష్టమైన ప్రకటన చేయలేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.
మార్కెట్ కమిటీ యార్డులపై కేంద్ర ప్రభుత్వం సూచన చేయకపోతే అవి నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో జరుపుతున్న సంప్రదింపుల్లో అన్నదాతల సూచనలు తీసుకోవాలన్నారు. పార్లమెంటులో కేంద్రంపై మాట్లాడేందుకు వైకాపా సభ్యులు భయపడుతున్నారన్నారు. రాజీలేకుండా తెదేపా పార్లమెంటులో రైతు చట్టాలపై ప్రజావాణి వినిపిస్తున్నామని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
వైకాపా ప్రభుత్వం రైతు వెన్ను విరిచిందన్నారు. వ్యవసాయ చట్టాల చర్చలో వైకాపా ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రైతులకు భరోసా ఇచ్చేవిధంగా కేంద్రం చట్టాలపై పునరాలోచన చేయాలన్నారు.
ఇదీ చదవండి : ఏలూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి తెదేపా ఫిర్యాదు