విశాఖ ఉక్కు సెగ త్వరలోనే సీఎం జగన్కు తగులుతుందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. వైకాపా నిర్వాకం వల్లే కర్మాగారం ప్రైవేటుపరం కానుందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఛత్తీస్గఢ్ తరహాలో తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కర్మాగారం నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
సీఎం జగన్ ఎప్పుడు దిల్లీ వెళ్లినా సొంత అజెండా మీదే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. 28మంది ఎంపీలున్నా.. కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైకాపాకు లేదని విమర్శించారు. ఈ నిర్ణయంపై రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వాజపేయిని స్ఫూర్తిగా తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం'