Lack of Facilities in AP Govt Schools: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ ప్రతి సభలోనూ చెబుతుంటారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నాడు-నేడు పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. కొన్ని బడులు మాత్రం ఇప్పటికీ కనీసం మౌలిక వసతులులేక దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని సాకివానిపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చిన్న గదిలో అది కూడా వెలుతురు లేని గదిలో ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల నిర్మించి సుమారు 40ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ మరుగుదొడ్లు నిర్మాణానికి నోచుకోలేదు. ఈ పాఠశాల గోడల లోపల ఇటుకలన్నీ బయటకు కనిపిస్తూ.. పెచ్చులూడిపోయి ఎప్పుడు కూలిపోతుందో అనే దుస్థితిలో ఉంది. వర్షం వస్తే ఇక ఆ రోజు స్కూల్ సెలవే. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్త, మురుగు పేరుకుపోయి దర్శనమిస్తోంది. తరగతుల నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థులు అదే గదిలో తినాల్సిందే.
ఒకే తరగతి గదిలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులు బోధిస్తుండటంతో చెప్పిన పాఠాలు అర్థం కావటం లేదని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల సదుపాయం లేక ఆరు బయటికి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. పాఠశాల ఆవరణలో చెత్త పేరుకుపోయి పాములు వస్తున్నాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో ఒకే గదిలో ఐదు తరగతుల విద్యార్థులకు బోధిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించే ఆర్థిక స్థోమత తమకు లేదని వాపోయారు. ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ఈ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
No Facilities in Libraries: ప్రశ్నార్థకంగా గ్రంథాలయాల మనుగడ.. సదుపాయాలు లేక ప్రజల పాట్లు
"మా పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు కూడా లేవు. దీంతోపాటు మా పాఠశాల శిథిలావస్థకు చేరిపోవటం వల్ల గోడల లోపల ఇటుకలన్నీ బయటకు కనిపిస్తూ.. పెచ్చులూడిపోయి ఎప్పుడు కూలిపోటుతుందో అని భయంగా ఉంది. ఒకే గదిలో ఐదు తరగతుల విద్యార్థలకు బోధించటంతో ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్త, మురుగు పేరుకుపోయింది. పాములు కూడా వస్తున్నాయి. దీంతోపాటు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు భవనం పై నుంచి పెచ్చులు పడిపోతున్నాయి. దీనివల్ల మేము పాఠశాల బయట మండుటెండలో తినాల్సి వస్తోంది. దయచేసి ప్రభుత్వం దీనిపై స్పందించి మాకు కొత్త పాఠశాల కట్టించాలని కోరుతున్నాము." - విద్యార్థుల ఆవేదన
Government Hostel Problems: శిథిలావస్థకు హాస్టళ్లు.. ప్రాణభయంతో విద్యార్థులు