జీడి, కొబ్బరితోటలు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని తిత్లీ కోలుకోలేని దెబ్బతీసింది. ఈ దెబ్బకు ప్రత్యామ్నాయ ఆదాయం మరొకటి లేకుండా పోయింది. రోజువారీ కూలీ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. చాలీచాలని సొమ్ముతో అష్టకష్టాలు పడుతున్నారు ఇక్కడి ప్రజలు. తుపాను ధాటికి ధ్వంసమైన తోటలు పునరుద్ధరించలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తిత్లీ తుపాను ప్రచండగాలులు ఉద్దానం ప్రాంతంలోని 46 పంచాయతీలను తీవ్రంగా నష్టపరిచాయి. వజ్రపుకొత్తూరు మండలం సహా పలాస, మందస, కవిటి, కంచిలి, సోంపేటలో జీడి, మామిడి, కొబ్బరి తోటలు ధ్వంసమయ్యాయి. కవిటిలో 5 పంచాయతీలు, సోంపేటలో ఏడు, కంచిలిలో ఐదు, మందసలో పది, పలాసలో మూడు వజ్రపుకొత్తూరులో 16 పంచాయతీల పరిధిలోని 20 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఏడాది నుంచి పైసా ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. సాంకేతిక లోపాలు, ఇతర కారణాలతో చాలా మందికి పరిహారం అందలేదు. కొందరు మత్స్యకారులదీ ఇదే దుస్థితి.
ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే ఆదుకునే చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. కిడ్నీ మహమ్మారితో సగం నాశనమైపోయిన జీవితాలు మరింత దుర్భరంగా మారకముందే చర్యలు తీసుకోవాలని ఉద్దానం ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.