ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ తెలిపారు. వంగర మండలం ఎం సీతారాంపురం గ్రామంలోని బాలుర వసతి గృహంలో శనివారం రాత్రి ఆయన బస చేశారు.
తొలుత గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం సిబ్బంది పనితీరు పై ఆరా తీశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, గ్రామంలో ఆధార్ సేవ ఏర్పాటు చేయాలని, అర్హత ఉన్న మహిళలకు చేయూత పథకం అందలేదని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
సచివాలయం నిర్మాణాలు, ఆర్బీకే నిర్మాణాల వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. తాను రాత్రి వసతి గృహంలో ఉంటానని, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ఉదయం వినతిపత్రం రూపంలో తనకు అందించాలని తెలిపారు. ఆయన వెంట పాలకొండ ఆర్డీవో కుమార్, డీఎస్పీ శ్రావణి, అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: Srikakulam district fishermen: ఆ 15 గంటలూ.. క్షణమొక యుగంలా...!