Santhosh Giving Free Army Training: అన్నీ ఉన్నప్పుడు సాయం ఎవరైనా చేస్తారు. ఏమీ లేనప్పుడు తోటి వారు ఎదిగేందుకు చేసే సాయం కచ్చితంగా గొప్పది. ఆ యువకుడు అదే చేస్తున్నాడు. తన కలల ఉద్యోగం చేరుకోలేక పోయినా.. తనలా ఇంకొకరు కావద్దని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫలితంగా తన వద్ద శిక్షణ పొందిన వాళ్లు ఎందరో దేశ రక్షణలో భాగమవుతున్నారు. అది గర్వకారణం అని చెబుతున్న యువకుడు ఎవరు..? అసలు అతడు ఏం చేస్తున్నాడు..? ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశ రక్షణ వ్యవస్థలో కొలువు సాధించాలని అనేక కలలు కన్నాడు. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కలలుగానే మిగిలిపోయాయి. కానీ కుంగిపోలేదు. తనలాగా మరెవరూ కావద్దనే ఉద్దేశంతో యూటర్న్ ఫిజికల్ అకాడమీ(U-Turn Physical Academy) స్థాపించి యువత ప్రభుత్వ కొలువులు సాధించేందుకు ఉచిత శిక్షణిస్తూ వారికి అండగా నిలుస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రావిపాడు గ్రామానికి చెందిన సంతోష్ 2016 నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు తీవ్రంగా కృషి చేశాడు.
ప్రతిసారి ఏదో ఒక విభాగంలో స్వల్ప తేడాతో విఫలమయ్యేవాడు.. ఇంతలో వయస్సు అర్హత మించిపోయింది. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకున్న తన కల నెరవేరలేదు. ఆర్మీలో చేరాలనుకునే కల నెరవేర లేకపోయినా సంతోష్ అక్కడితో నిరాశ చెందలేదు. తాను నేర్చుకున్న శిక్షణను తనలాంటి నిరుద్యోగ యువతకు నేర్పిస్తున్నాడు.. మూడు సంవత్సరాల క్రితం యూటర్న్ అనే అకాడమీ స్థాపించాడు. చుట్టుపక్కల గ్రామాల యువకులకు దేహదారుఢ్య శిక్షణలో మెళకువలు నేర్పిస్తూ ఆర్మీ ఉద్యోగాలు సాధించేందుకు అండగా నిలుస్తున్నాడు.
ప్రస్తుతం ఇక్కడ 40 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. యూటర్న్ అకాడమీ ద్వారా శిక్షణ పొంది ఈ ఏడాది పదిమంది గ్రామీణ యువకులు ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారందరూ నిరుపేద కుటుంబానికి చెందిన యువకులే.. యువకుల శరీర దారుఢ్యాన్ని పెంపొందించేందుకు గ్రామంలో ఉన్న వనరుల సహాయంతోనే సాధన చేస్తున్నారు. ప్రణాళిక బద్ధమైన సాధన ద్వారా తమ లక్ష్యాన్ని సాధించగలుగుతున్నాం అంటున్నారు. ఆర్మీ, నేవీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు యూటర్న్ అకాడమీ ద్వారా సిద్ధమవుతున్నారని యువకులు అంటున్నారు. తమ భవిష్యత్ బావుండాలని కోచ్ సంతోష్ చాలా కష్టపడుతున్నారని, ఆయన వల్లే తాము ఉద్యోగం సాధించామంటున్నారు ఈ యువకులు. తమకు ప్రణాళికాబద్ధంగా శిక్షణిచ్చినందుకు సంతోష్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
కోచ్ సంతోష్ తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తన కొడుకుకి ఉద్యోగం రాకపోయినా తనలాంటి చాలామంది యువకులకు సహాయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని అంటున్నారు. సంతోష్ ఇప్పటికే జాతీయ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పలు పథకాలు సాధించాడు. గ్రామీణ యువకులను ఆర్మీ ఉద్యోగాలతో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్నానని.. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే వందలాది మంది నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించడానికి వీలుంటుంది అని అనుకున్నాడు. ఓటమి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించి గ్రామీణ నిరుపేద యువతకు భరోసానిస్తున్న సంతోష్ ప్రయాణం మరింత ముందకు సాగాలని కోరుకుందాం.