శ్రీకాకుళం జిల్లాలో ఇసుక నిల్వలకు ప్రధాన వనరుగా వంశధార నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. అంతర్జాలం ద్వారా ఇసుక కోసం వినియోగదారులు దరఖాస్తు చేస్తుండగా... రేవుల నుంచి సరఫరా చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితి అక్రమాలకు దారితీస్తోంది. నరసన్నపేట మండలం మడపాం, గోపాల పెంట, చేనుల వలస, పోతయ్య వలస ఇసుక రేవులో ఇసుక తవ్వకాలు, సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. ఒక్కసారిగా 4 రేవులు మూతపడగా ఇసుక కొరత ఏర్పడింది.
మడపాం ఇసుక రేవులో మార్చి 23 నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. అదే గ్రామానికి చెందిన 8 మంది రైతుల భూములకు పరిహారం ఇవ్వని కారణంగా.. రేవు నుంచి నిల్వ కేంద్రానికి రాకపోకలు అడ్డుకున్నారు. సొంత భూముల పైనుంచి నిర్మించిన రహదారి కావడంతో రైతులు రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వారు. ఫలితంగా.. నదిలోంచి ఇసుక రవాణా నిలిచిపోయింది.
గోపాలపేట రేవులో ఇసుక తవ్వకాలకు సంబంధించి వాహనదారులకు చెల్లింపుల బకాయిలు పేరుకుపోతున్నాయి. అక్కడ కూడా ఇసుక తవ్వకాలు స్తంభించాయి. చేనుల వలస రేవులో వారం రోజులుగా ఇసుక సరఫరా ఆగిపోయింది. శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ ఇసుక రేవులోనూ సరఫరా, తవ్వకాలు నిలిచిపోయాయి. ఇలా రేవులు మూతపడడం అక్రమార్కులకు వరంగా మారింది.
నరసన్నపేట ప్రాంతంలో ఇసుక రేవులన్నీ ఓ ప్రజా ప్రతినిధి కుటుంబీకుడి చేతిలోకి వెళ్తున్నట్టు సమాచారం. ప్రస్తుత గుత్తేదారు నుంచి ఇసుక రేవులను సదరు ప్రజా ప్రతినిధి కుటుంబీకుడు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా గుత్తేదారు పేరున ఉన్న ఇసుక రేవులను తెరచాటుగా రాజకీయ బంధువు నిర్వహించే ప్రయత్నాలు సాగుతున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.