Narasannapeta Rajula Cheruvu : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి వందల ఏళ్లుగా తాగు, సాగు నీటిని అందిస్తున్న రాజుల చెరువు.. నేడు అక్రమార్కుల చేతిలో చిక్కుకుపోయింది. అంతేకాకుండా కాలుష్యానికి బలై.. సాగు, తాగు నీరు అందించలేని దుస్థితికి చేరుకుంటోంది. చెరువును పక్షాళన చేసి.. శుద్ధమైన నీటితో చెరువు కళకళలాడాలనేది నరసన్నపేట పట్టణ వాసుల చిరకాల కోరిక. వారి కాంక్షకు అనుగుణంగా రాజుల చెరువు ప్రక్షాళనపై నాలుగు మాసాల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హమీ ఇచ్చారు. ఆయన హామీ అయితే ఇచ్చారు కానీ, హామీ దిశగా మాత్రం ఇప్పటికి అడుగులు పడటం లేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చారని నిధులు విడుదల కాక ఇచ్చిన హామీ క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు.
'నరసన్నపేట రాజుల చెరువు అభివృద్ధికోసం పదికోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సహాయం కావాలి అని స్థానిక నేతలు నన్ను అడిగారు. ఈ సహాయాన్ని అందిస్తాము.' అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నో వందల సంవత్సరాలుగా నరసన్నపేట గ్రామ ప్రజలకు రాజుల చెరువు తాగునీరు అందిస్తోంది, సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉండగా.. చెరువు గట్లపై స్థలాన్ని అక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్నారు.
ఈ ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు, చెరువుకు సమీపాన ఉన్న దుకాణాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులోకి చేరుతోంది. దీంతో చెరువులోని నీరు కలుషితమవుతోంది. గతంలో చెరువు నీటిని తాగు నీటికి వినియోగించే పరిస్థితి ఉండగా.. నేడు చెరువులోని దుర్గందం వల్ల కనీసం చెరువు పక్కన కూడా నడవలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పూర్వం చెరువు చుట్టూ ప్రశాంతంగా ఉండే పరిసరాలు కలుష్యబరితంగా మారిపోయాయని అంటున్నారు. ఆక్రమణలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా.. అధికార పార్టీ అండదండలు చూసుకుని అక్రమార్కలు మరింత చెలరేగిపోతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
గత ప్రభుత్వ హయంలో రాజుల చెరువు అభివృద్ధికి 50 లక్షల రూపాయలు విడుదల కాగా.. సగం పనులను మాత్రమే పూర్తి చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావటంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అందువల్లే చెరువు నేటి స్థితికి చేరుకుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి వాగ్దానాలు, పత్రికల ప్రకటనల కోసమే తప్పా.. అభివృద్ది కోసం చేసింది ఏమీ లేదని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
"గతంలో రాజుల చెరువు అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. అప్పుడు చెరువులో నీరు తొలగించి వేరే చెరువు నుంచి ఇందులోకి మంచి నీరు తీసుకువచ్చేవాళ్లము. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలకు గురైంది. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దీనిని అభివృద్ధి చేస్తానని.. 10 కోట్ల రూపాయలు నిధులు మాంజూరు చేస్తానని అంటే మేము స్వాగతించాము. అచరణలోకి ఇంకా రాలేదు." -చిట్టిబాబు, మాజీ సర్పంచ్,
"ఎప్పటి నుంచో ఈ చెరువు అభివృద్ధి చేస్తామనే ప్రకటనలు, వార్తలు వింటున్నామే తప్ప.. అభివృద్ధి లేదు. వాకింగ్ కోసం వెళ్లటానికి వృద్ధులకు ఈ చెరువు సమీపంలో ఉంది. వారికి మానసిక ఉల్లాసం కోసం ఇది దోహదపడుతుంది." - ఈశ్వరమ్మ, స్థానికురాలు
ఇవీ చదవండి :