Farewell Parade For Retirement Of DGP Dwaraka Tirumala Rao : తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలని పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ సభలో డీజీపీ ద్వారక తిరుమలరావు వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా తనని అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్ గా అనిపించిందన్నారు. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న తనకు అనేక మంది సహకరించారని గుర్తుచేసుకున్నారు. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశానని ద్వారకతిరుమలరావు తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామన్నారు. సైబర్ క్రైమ్, గంజాయి, మహిళలు, చిన్నారులపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు : విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని కొనియడారు. యూనిఫాం ధరించిన వారు అందరికీ న్యాయం అందించాలని కోరారు. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కేసుల విచారణలో నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ద్వారక తిరుమలరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశానన్నారు. వీధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు, గుణపాఠాలు, పరిచయాలు, ఎమోషన్స్ కలిగి ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో లేనప్పటికీ తన మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందన్నారు.
ఆయన సేవలను కొనసాగిస్తాం : పదవి విరమణ వీడ్కోలు సందర్బంగా డీజీపీ ద్వారక తిరుమల రావు పరేడ్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ద్వారక తిరుమల రావు ఏపీ పోలీస్ శాఖ లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ప్రజల భద్రత, సేఫ్టీ కోసం అనేక సంస్కరణలు చేపట్టారని కొనియడారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారని, ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ లతో చేసిన పోలీస్ సేవలను కొనసాగిస్తామన్నారు. సైబర్ నేరాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు. నూతన డీజీపీగా తన శక్తి మేర పనిచేస్తానని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్ల మీద నిఘా పెడతామన్నారు. అస్త్రం యాప్ ను వినియోగించి ట్రాఫిక్ ను నియంత్రించటం పోలీస్ శాఖలో ఓ మైలురాయి అని గుర్తుచేశారు.
35 ఏళ్లు పోలీస్ ఆఫీసర్గా ప్రజలకు సేవ - సంతృప్తిగా ఉంది: డీజీపీ
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం