శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ విద్యా భూషణ్ బుధవారం పర్యటించారు. స్టేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన అధికార కార్యాలయాలు, రైల్వే ఇనిస్టిట్యూట్లను ఆయన ప్రారంభించారు. స్టేషన్‌లోని ప్రధాన సమస్యలను వివిధ పార్టీల నాయకులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన జనరల్ మేనేజర్... సమస్యను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. స్టేషన్ ఆవరణ అద్భుతంగా ఉందని అధికారులను అభినందించారు. కరోనా వైరస్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచించారు. రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాత్సవ్‌తో పాటు అధికారులు ఆయన వెంట ఉన్నారు.
టెక్కలి నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్లో పర్యటన..
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే రైల్వే శాఖ జనరల్ మేనేజర్ విద్యా భూషణ్ బుధవారం పరిశీలించారు. రైల్వే క్వార్టర్స్ సమీపంలో చిల్డ్రన్ పార్క్‌ను డీ.ఆర్.ఎం. చేతన్ కుమార్ శ్రీవాత్సవతో కలసి ప్రారంభించారు. స్టేషన్ పరిసరాలను డ్రోన్ కెమెరాతో పరిశీలించిన ఆయన.. అధికారులకు తగు సూచనలు చేశారు.
వంతెల కోసం వినతులు..
పాత నౌపడా గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రమాదకర స్థితిలో రైల్వే ట్రాక్ దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలతో కలిసి విద్యార్థులు జీఎంను కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఇప్పటికే వంతెన మంజూరు చేశామని నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
సంతబొమ్మాళి మండలంలో రైల్వే ట్రాక్ పక్కనున్న పంటపొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్ వంతెన నిర్మించాలని రైతుల తరఫున ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు జీఎంను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: