Investment Frauds : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే తక్కువ రోజుల్లోనే రెట్టింపు నగదు వస్తుందంటూ కొందరు, నూతన సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం కొంత పెట్టుబడి పెడితే చాలు లక్షల రూపాయలు లాభాలు వస్తాయంటూ మరికొందరు ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. విజయవాడ పరిధిలోనే 85 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 50 మంది చదువుకున్న వారే ఉండటం గమనార్హం. వేరొకరి వద్ద దోచేసిన సొత్తునే ఇంకొకరికి బదిలీ చేస్తున్నారని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసుల్లో వినియోగదారులు కూడా నిందితులుగా మారతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు.
డబ్బు ఆశతో పెట్టుబడులు: మనిషిలో ఆశ ఎదుటి వారికి పెట్టుబడిగా మారుతుంది. అధిక డబ్బులు వస్తాయని ఎరవేసి లక్షల రూపాయలు సైబర్ నేరస్తులు దోచుకుంటున్నారు. మా కంపెనీలో పెట్టుబడి పెడితే అనతి కాలంలోనే రెట్టింపు నగదు వస్తుందని ఆన్లైన్లో పబ్లిసిటీ ఇస్తున్నారు. ఉచ్చులోకి లాగేందుకు వినియోగదారునికి మొదట్లో రెట్టింపు నగదు ఇస్తారు. కొన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోతారు. పెట్టుబడుల పేరుతో అమాయకుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇన్వెస్ట్ మెంట్ఫ్రాడ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
చివరకు నగదు రాక లబోదిబో: రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టండి మీకు రెట్టింపు నగదు ఇస్తాం అని ఆన్లైన్లో ఆకర్షిస్తున్నారు. మరికొందరు నూతన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నాం, మొదట కొంత పెట్టుబడి పెడితే అనంతరం లక్షల రూపాయల లాభాలు వస్తాయని నమ్మిస్తారు. ఇంకొకరు బిట్ కాయిన్స్‌లో పెట్టుబడి పెడితే త్వరగా లాభాలు వస్తాయని ఉచ్చులోకి లాగుతున్నారు. ఈ విధంగా డబ్బు ఆశ చూపి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మొదట్లో రెట్టింపు నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో బాధితులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. చివరకు నగదు రాక లబోదిబో మంటున్నారు. అమాయకులను నమ్మించేందుకు సెలబ్రిటీల పేర్లు, వాళ్లు మాట్లాడినట్లు డీప్ ఫేక్ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆకర్షిస్తున్నారు.
బ్యాంకు ఖాతా కోసం వివరాలు ఇస్తున్నారా? - జాగ్రత్త పడకుంటే జైలుకే!
చదువుకున్న వారే ఎక్కువ: నగరంలో ఈ తరహా 85 కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 కేసుల వరకు చదువుకున్న వారే ఉండటం గమనార్హం. కొందరు చిరుద్యోగాలు చేస్తూ అదనపు ఆదాయం వస్తుందని ఆశతో కట్టిన వారే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పెట్టుబడుల పేరుతో ఒకరు విడతల వారీగా కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నారని, 50 సార్లు లావాదేవీలు జరిపారని విజయవాడ సైబర్ క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి చెప్పారు. మరొకరు 45 సార్లు లావాదేవీలు జరిపారని తెలిపారు.
మేము కూడా బాధితులమే: బాధితుల్లో చాలామంది అదనపు ఆదాయం వస్తుందని, మరికొందరు ఆశతో ఆన్లైన్లో పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు ఒక బాధితుడి నుంచి వసూలు చేసిన నగదును ఇంకొక బాధితుడికి పంపుతున్నారు. దీంతో పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి విచారణ చేస్తే తాము కూడా బాధితులమనే చెబుతున్నారు. ఈ తరహా నేరాల్లో ఒకసారి లావాదేవీలకు వినియోగించిన బ్యాంక్ ఖాతాను మరో సారి వినియోగించరని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసుల్లో బాధితులు నిందితులుగా మారుతున్నారని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌లో ఎవరూ పెట్టుబడిలో పెట్టొద్దని పోలీసులు సూచించారు. పెట్టుబడుల పేరుతో జరిగే నేరాలను తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ఆ కంపెనీ గురించి వివరాలు సేకరించి పరిశీలించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని పోలీసులు తెలిపారు. ఏ సంస్థ కూడా తక్కువ సమయంలో రెట్టింపు నగదు ఇవ్వదని, అటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని పోలీసులు హితవు పలికారు.
పెట్టుబడి పెట్టి మోసపోయారా? - పలు కేసుల్లో నిందితులు మీరే కావొచ్చు! - అసలు విషయం తెలిస్తే షాకే