రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 4వేల250 కరోనా నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు మరో 33 మంది బలయ్యారు. కరోనా నుంచి మరో 5వేల 570 మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నిబంధనలకు సంబంధించిన సమయాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ సూచించారు. తెనాలిలోని లాక్‌డౌన్ నిబంధనలను ఆయన పరిశీలించారు. లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన సమయంలో నగర వాసులు కరోనా నిబంధనలు పాటించటం లేదని విజయవాడ సీపీ శ్రీనివాసులు మండిపడ్డారు. వ్యాక్సినేషన్ వేయించుకున్నా ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరించాలన్నారు.
అనంతపురంలో కర్ఫ్యూ అమలు తీరును డీఐజీ కాంతి రాణాటాటా, ఎస్పీ ఏసుబాబు పరిశీలించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 3 వేల కేసులు నమోదు చేసి.... 5 వేల వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. కరోనా ముడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకరం ఎంతో అవసరమని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. ఇంట్లో ఉంటూ కరోనా నుంచి రక్షణ పొందాలని నెల్లూరు జిల్లా ఎఎస్పీ వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు. వీఆర్సీ కేంద్రం వద్ద కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన ఆయన.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలువురు వాహనదారులకు జరిమానా విధించారు. తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి పట్టణ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వాహనాలను ఆపి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికీ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ షీమోషీ భాజ్ పాయ్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రహాదారులపై తిరిగే వాహనదారుల నుంచి 2 కోట్ల 69 లక్షల పైగా నగదు ఈ-ఛలానా రూపంలో వసూలు చేసినట్టు తెలిపారు. కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని కడప ఎస్పీ అన్బు రాజన్ సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో లాక్‌డౌన్ అమలు తీరును కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను అదుపులోకి తీసుకొని సుమారు 200 వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. చీరాలలో కొవిడ్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ముఖ్య కూడళ్లలో పోలీసులు అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
విశాఖలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2 వేల కేసులు నమోదు చేసినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ అమలును ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. మాస్కు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి మాస్కులు అందించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో డీఐజీ రంగారావు పర్యటించారు. కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారిపై 45 వేల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డెల్టా ప్లస్ వంటి కేసులు వస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నారు.
ఇవీచదవండి.