No People In Village At Srikakulam District : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. దేశం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ ముందుకు దూసుకుపోతోంది. అంతరిక్షయానంలోనూ అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. ఊరిలో కనీస వసతులు లేక గ్రామం మొత్తం వలసబాట పట్టిన పరిస్థితులు మరోవైపు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం కర్నాలపేటలో గ్రామస్థులు వలస బాట పట్టడంతో చివరికి ఊరిలో కేవలం ఒక కుటుంబం మాత్రమే మిగిలింది. కన్నతల్లి లాంటి ఉన్న ఊరిని వదిలి ఉండలేక అభివృద్ధికి దూరంగా ఉంటూ పాడుబడ్డ ఇళ్ల మధ్యే ఆ కుటుంబ సభ్యులు కాలం వెళ్లదీస్తున్నారు.
"పల్లె పొమ్మంటే పట్నం రమ్మంటోంది" బతకలేని బక్క ప్రాణులను వీడని వలసల పర్వం
Immigration Due to No Development : శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటకు 25 కిలోమీటర్ల దూరంలో కర్నాలపేట అనే గ్రామం ఉంది. ఒకప్పుడు వందల మంది ప్రజలతో కళకళ్లాడిన ఈ గ్రామంలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే నివాసముంటున్నారు. ఊరు చుట్టూ పచ్చని చెట్లు పంట పొలాలు ఆహ్లాదకర వాతావరణం. ఊరిలో మాత్రం పాడుబడి శిథిలావస్థకు చేరిన ఇళ్లు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. అయినా సాహసం చేసి ఆ ఊరిలో జగదీశ్వరరావు, శర్వాణి అనే దంపతులు ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అత్యవసర వస్తువులు, నిత్యవసరాలు ఏది కావాలన్నా 5 కిలోమీటర్లు దూరం పొలాల గట్లపై నడుచుకుంటూ వెళ్లాల్సిందేనని వారు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన సేవలు ఆ ఊరికి నేటికీ చేరలేదు.
నీరు లేక.. కూలీలుగా మారుతున్న పశ్చిమ ప్రకాశం రైతులు
Srikakulam District Karnalapet : ఒకప్పుడు ఈ గ్రామంలో 40 కుటుంబాలు నివసించేవి. మౌలిక వసతులు లేకపోవడంతో ఉపాధి కోసం కొంతమంది, ఉద్యోగుల పేరుతో మరి కొంతమంది వలసలు వెళ్లిపోగా జగదీశ్వరరావు కుటుంబం మాత్రమే మిగిలింది. వలసలు వెళ్లిన వారు ఏడాదికి ఒకసారి శ్రీరామనవమికి గ్రామానికి వచ్చి పండగ చేసుకుని మళ్లీ మరుసటి రోజు వెళ్లిపోతారు. మిగిలిన రోజుల్లో ఊరిలోని ఇళ్లన్నీ తాళాలు వేసి ఉంటాయి. వాటన్నింటికీ జగదీశ్వరరావు ఆయన భార్య కాపలాగా ఉంటారు. గ్రామంలోని సమస్యలపై పలుసార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని వాపోతున్నారు.
Only One Family In Village : గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గ్రామానికి రోడ్డు వేసేందుకు శంకుస్థాపన చేయడంతో ఎంతో సంతోషించామని అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయని , గ్రామస్థుడు జగదీశ్వరరావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అసలు పట్టించుకోలేదని గ్రామస్తురాలు శర్వాణి అసంతృప్తి వ్యక్తం చేశారు.