శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు (లక్ష్మీదేవిపేట) మత్స్యకారుల గ్రామం. పది వేల జనాభా. సుమారు 5 వేల మంది ఓటర్లు. 14 వార్డులు. సింహభాగం కేవిటి సామాజికవర్గం వారే. గ్రామస్థులంతా ఒక్కతాటిపై నిలబడి.. ఒక్కరినే అభ్యర్థిగా నిలబెట్టి.. ఏకగ్రీవంగా ఎన్నికల ప్రక్రియ ముగించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. 70 ఏళ్లలో ఎప్పుడూ పంచాయతీ పోరు జరగకపోవడం విశేషం. ఎన్నికల వేళ స్థానిక బృందావతి ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు సమావేశమై.. రిజర్వేషన్‌కు అనుగుణంగా సర్పంచి, ఎంపీటీసీ అభ్యర్థులను నిర్ణయిస్తారు. వారితోనే నామినేషన్ వేయిస్తారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.
‘మా ఊరిలో ఎన్నికలు జరిగి ప్రజలు మద్యం, డబ్బుల పంచడానికి మేం వ్యతిరేకం. ప్రచారానికి ఏ పార్టీ నాయకులూ మా ఊరికి రారు. ఏకగ్రీవం వల్ల వచ్చే ప్రభుత్వ పారితోషికంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్నామ’ని మాజీ ఎంపీటీసీ సభ్యుడు బైనపల్లి వెంకటేశ్ తెలిపారు. ‘ఊరంతా ఒక్క మాటపై ఉంటాం. సర్పంచి పదవికి పోటీ పడి కలతలు తెచ్చుకొని మా ఐక్యతను దెబ్బతీసుకోం. సార్వత్రిక, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రమే ఓటు వేస్తామ’ని గ్రామ పెద్ద బెహరా మధుసూదన్ చెబుతున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ