MLA Kiran Kumar: గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నా గడిచిన మూడేళ్లుగా ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే కిరణ్ కుమార్ను స్థానికులు నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గదబపాలెం గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిరణ్ కుమార్కు చుక్కెదురైంది. గ్రామంలోని వీధిలో రోడ్లు లేవు.. కాలువలు లేవు.. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి గ్రామానికి రెండు కిలోమీటర్లు మట్టిరోడ్డే తప్ప.. తారు రోడ్డు ఎప్పుడు వేస్తారని నిలదీశారు.
అంబులెన్స్ రావాలన్నా, గ్యాస్ రావాలన్నా, పాల ప్యాకెట్లు రావాలన్నా ఇబ్బందిగా ఉందని.. అన్నిటికీ దూరంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వచ్చి ప్రాధేయపడతారని.. ఇప్పుడు సమస్యలు చెబితే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల శిథిలావస్థకు చేరిందని.. పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. తరగతి గదులను ఎమ్మెల్యేకు చూపించారు. పలువురు సమస్యలు చెబుతుంటే ఎమ్మెల్యే వినుకుండా దాటవేశారు. సమస్యలున్నా పరిష్కరించడం లేదని గ్రామస్థులు వాపోయారు. పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్నామని ఎమ్మెల్యేకు చెబుతుంటే.. కనీసం పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: