Villagers Protest: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి బయలుదేరిన మంత్రికి.. ఆ ఊరు గడపను చేరకముందే నిరసన సెగ తగిలింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ ప్రాంత ప్రజలు మంత్రి అప్పలరాజును నిలదీశారు. మెుదట మంత్రి సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా.. వారంతా తమకు న్యాయం చేసే వరకు కదలనివ్వం అంటూ భీష్మించడంతో వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు వద్ద మంత్రి సీదిరి అప్పలరాజును.. ఉప్పటేరు వంతెన రహదారి నిర్వాసితులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట వెళ్తున్న మంత్రిని అడ్డుకొని పరిహారంతో పాటు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన తర్వాతే వంతెన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కోసం చిన్న చిన్న స్థలాలు చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు. అలా కాకుండా స్థలాల వైశాల్యం పెంచాలని డిమాండ్ చేశారు. అంతవరకూ పనులు మొదలు పెట్టకూడదని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.