జంతుదాడుల లెక్కలు
అటవీ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2014-15 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 56 జంతువుల దాడి ఘటనలు జరిగాయి. ఈ దాడిలో 22 మంది మృతి చెందగా... 56 మంది గాయపడ్డారు. ఈ ఘటనల్లో 490 పశువులూ ప్రాణాలు కోల్పోయాయి. అలాగే... పంటల నష్టం భారీగానే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పరస్పర దాడి ఘటనలో జంతువులు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. పొలాల్లో విద్యుదాఘాతంతో మూగజీవాలు సైతం బలవుతున్నాయి. పల్లెలు, పట్టణాలలో కోతుల బాధ అంతా ఇంతా కాదు.
సమాచారం ఇవ్వండి.. దాడులు చేయకండి
గ్రామాల్లోకి జంతువులు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు.. భయంతో వాటిపై దాడి చేయకుండా.. తమకు సమాచారం ఇవ్వాలని అటవీ అధికారులు కోరుతున్నారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అటవీశాఖ అధికారి మహ్మద్ ఇలియాస్ రిజ్వీ తెలిపారు.
ఉన్నతస్థాయి కమిటీ
నివాసం, ఆహారం కోసం జంతువులు, మనుషుల మధ్య వైరుధ్యం వస్తోందని, వాటిని నివారించేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోందని రిజ్వీ తెలిపారు. ఈ చర్యలో భాగంగానే 2018 అక్టోబరులో అటవీ శాఖ ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కొన్ని సిఫార్సులు చేసింది.
కోతులకూ ఓ కేంద్రం
జనబాహుళ్యంలోకి చొచ్చుకుని వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కోతులను అదుపు చేసేందుకు, కోతుల గణన చేపట్టాలని నివేదించింది. కోతుల సంఖ్యను పరిమితం చేసేలా కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఈ కమిటీ నిర్ణయించింది. అందుకోసం విశాఖపట్నం, తిరుపతిలో కోతుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఏనుగుల సంరక్షణ కేంద్రం
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బెడదను పరిష్కరించేందుకు.. జిల్లాలో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నివేదికలో పొందుపరిచింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీప్రాంతంలో ప్రస్తుతం 10 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. విజయనగరం జిల్లా దొంతికొండ పరిసర ప్రాంతంలో 540 హెక్టార్ల విస్తీర్ణంలో ఏనుగుల సంరక్షణాకేంద్రం ఏర్పాటు దిశగా అటవీ శాఖ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనలను తుదిగా ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఇలా... అడవి జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంఘర్షణలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: