శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భూముల లెక్కలను అధికారులు తేల్చనున్నారు. భూ సర్వే ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ప్రాధాన్య కార్యక్రమాల్లో సింహభాగం కల్పిస్తోంది. దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ దస్త్రాలను ప్రక్షాళన చేసే దిశగా సర్వేయర్లను రంగంలోకి దింపుతోంది. ఇది పూర్తయితే జిల్లాలో భూసమస్య అన్న మాటే వినిపించదని అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి లెక్కలన్నీ పక్కాగా డిజిటలీకరణ చేసే విధంగా ప్రణాళిక తయారు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు ఇలా అన్నింటిని కబ్జాకు గురయ్యాయి. పూర్వ దస్త్రాల ప్రాప్తికి వీటన్నింటినీ వెలికి తీయనున్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన పనుల్లో సిబ్బంది యావత్తూ నిమగ్నమై ఉన్నారు. ఈనెల 8వ తేదీతో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుంది.
పక్కాగా దస్త్రాల తయారీ
సమగ్ర సర్వే పూర్తయ్యాక భూ దస్త్రాలు పక్కాగా తయారవుతాయి. ఎఫ్‌ఎంబీల నుంచి ఇతర దస్త్రాల వరకు డిజిటలీకరణ చేస్తారు. జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో దీన్ని నిర్వహించాలన్నది ప్రణాళిక. శిక్షణలు, క్షేత్రస్థాయి సర్వే ప్రాథమిక పరిశీలన పూర్తయ్యాక 22 నెలల్లో సమగ్ర సర్వే పూర్తి చేసేవిధంగా రాష్ట్ర స్థాయిలో కాలపట్టిక రూపొందించారు. సర్వేకు అవసరమైన అత్యాధునిక పరికరాలు ఇప్పటికే రప్పించారు.
భూవివాదాలు పరిష్కారం
సర్వే సమయంలో భూవివాదాలు తెరపైకి వస్తాయి. ఆయా హక్కులను తేల్చి నమోదు చేసేందుకు వీలుగా డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తారని సంబంధిత వర్గాలు విశదీకరిస్తున్నాయి. సమగ్ర సర్వే పూర్తయ్యాక పూర్తి పారదర్శకతకు వార్డు/ గ్రామ సచివాలయాల్లో రైతుల పేర్లు, సర్వే నెంబరు, భూ విస్తీర్ణం తదితర వివరాలు అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇది పూర్తయ్యాక ఆధార్ సంఖ్య తరహాలోనే భూదార్ నెంబరు కేటాయిస్తారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
సర్వే తరువాతే సమగ్ర సర్వే!
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సర్వే జరుగుతోంది. తొలుత కొలతల (సర్వే) రాళ్లు గుర్తిస్తున్నారు. క్షేత్రస్థాయి, ఎఫ్‌ఎంబీల మధ్య సబ్‌డివిజన్లలో భారీ తేడా కనిపిస్తోంది. దీన్ని ప్రధానంగా తేల్చే పనిలో ఉన్నారు. మున్ముందు నిర్వహించే సమగ్ర సర్వేలో ఈ రెండు కీలక భూమిక పోషించనున్నాయి. ఇందులో వ్యత్యాసాలు, ఇతర అంశాలను పొందుపరుస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 13వ తేదీన శిక్షణ ఇవ్వాలని సంకల్పించారు. జిల్లాలో 62 మంది డిప్యూటీ సర్వేయర్లు, సర్వేయర్లు ఉన్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చిన అనంతరం సచివాలయాల్లోని 651 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చేవిధంగా కార్యక్రమం తయారు చేశారు. పని ఒత్తిడితో ఆగస్టులో ఈ ప్రక్రియ కొనసాగించాలని భావిస్తున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో సమగ్ర భూసర్వేకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమిక సర్వే జరుగుతోంది. ఇళ్ల పట్టాల కార్యక్రమంతో కొంత జాప్యం జరుగుతోంది. ఇది పూర్తయ్యాక వేగం పుంజుకుంటుంది. సర్వే పూర్తయితే భూ సమస్యలు ఉత్పన్నం కావు. అంతా ఆధునిక రీతిలో పక్కాగా కొనసాగుతుంది. - కె.ప్రభాకర్, ఏడీ, సర్వేశాఖ, శ్రీకాకుళం
ఇదీ చదవండి: ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్