రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రహదారుల అధ్వాన పరిస్థితిపై నిరసన వ్యక్తం చేస్తున్న.. జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలపై దాడులు చేయడం చాలా బాధాకరమని అన్నారు. పోలీసుల సమక్షంలోనే వైకాపా నాయకులు దాడులకు తెగబడడం చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. సభాపతి తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై పార్టీ నాయకుడు పేడాడ రామ్మోహనరావు శాంతియుతంగా ప్లెక్సీ రూపంలో ఒక విన్నపం చేస్తే దాడి చేశారని చెప్పారు. పోలీసుల సమక్షంలో దాదాపు 25 మందికిపైగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి తెగబడ్డారని విమర్శించారు. ఈ దాడిలో రామ్మోహన్‌రావుతోపాటు ఏడుగురు జనసైనికులు గాయపడ్డారని వెల్లడించారు. దాడి చేసిన వారిపై తొలుత కేసులు పెట్టకపోగా, ప్రజాసమస్యలపై నిరసన తెలిపిన తమ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. గాయాలపాలైన వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడానికి పోలీసులు విముఖత చూపించారని అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలిపి, దాడి చేసిన వారిపై కేసులు పెట్టేలా చేశారని అన్నారు.
కేసులకు భయపడే ప్రసక్తే లేదు..
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య పెద్దదవుతుంది తప్ప... పరిష్కారం కాబోదని పవన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇదే విషయాన్ని తాము తెలియజేశామని... తమ కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని హెచ్చరించారు. ఆ పరిస్థితిని తీసుకురావొద్దని పోలీస్ ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నానని అన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని... ఏకపక్షంగా ప్రభుత్వ పక్షం వహిస్తే పోలీసులు వారి వృత్తికి ద్రోహం చేసినవాళ్లవుతారన్నారని చెప్పారు. పోలీసుల సాయంతో కేసులుపెట్టి, దాడులు చేస్తే భయపడే వ్యక్తులం మాత్రం కాదని పవన్ స్పష్టం చేశారు.
ఫోన్ ద్వారా పరామర్శ
వైకాపా శ్రేణుల దాడిలో గాయపడిన పేడాడ రామ్మోహనరావును పవన్‌కల్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్వీ, టి.శివశంకర్‌తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారని తెలిపింది.
సభాపతి రాజీనామా చేయాలి: శివశంకర్
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం తన పదవికి రాజీనామా చేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండు చేశారు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్మోహనరావు తదితరులను ఉత్తరాంధ్ర ప్రతినిధి బి.సత్యనారాయణతో కలిసి శివశంకర్ ఆదివారం పరామర్శించారు.
ఆమదాలవలసలో దాడి.. ఏం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఆదివారం జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్‌రావు గాయపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్యం వివాదం తలెత్తింది. ఈ ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ ఘాటుగా స్పందించారు.
ఇదీ చదవండి: ycp attack: ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయుల దాడి