అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. టెక్కలిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడం మండలాల్లో తెల్లవారుఝాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. సుభద్రపురం కూడలి సమీపంలో భారీ వర్షానికి రహదారిపై కిలోమీటర మేర వరదనీరు చేరింది. బుడుమూరు పెద్ద గడ్డ ఉదృతంగా ప్రవహించింది. రాయిలింగారిపేట వద్ద కాజ్వే వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో చేతికందిన మొక్కజొన్న సుమారుగా 800 ఎకరాల్లో నేలమట్టం అయింది. మరో 1500 ఎకరాల్లో వరి నీట మునిగింది.
అప్రమత్తమైన అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఒడిశాలోని భాగలటి డామ్‌లో 103 మీటర్ల స్థాయిలో నీరు ఉందన్న కలెక్టర్... 106 మీటర్ల సామర్ధ్యం మించితే నీటిని విడిచి పెట్టే అవకాశం ఉందన్నారు. వంశధారలో 40 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. నాగావళి నదిలోనూ 15 వేల క్యూసెక్కుల వరకు ప్రవహిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: