Difficulties faced by fishermen: శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవున, 11 సముద్ర తీర మండలాలు, 104 గ్రామాల్లోని లక్షా 12 వేల మంది మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడంతో మత్స్యకార కుటుంబాలు వలస బాట పడుతున్నాయి. వేట సరిగా సాగాలంటే మత్స్యలేశం, రోళ్లపేట, ఇద్దివానిపాలెం ప్రాంతాల్లో.. మినీ జెట్టీలు నిర్మించాలని మత్స్యకారులు ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేస్తున్నారు. బుడగట్లపాలెంలో 37 ఎకరాల్లో 332 కోట్ల అంచనా వ్యయంతో హార్బరు.. వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు-మంచినీళ్ల పేట మధ్యలో 13 ఎకరాల్లో టీ-జేట్టి నిర్మించేందుకు 12 కోట్లతో అనుమతులు మంజూరు చేసినా.. ఆదిలోనే గుత్తేదారులకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి..
ప్రస్తుత పరిస్థితుల్లో చేపల వేట సాగించాలంటే సాంకేతికత కచ్చితంగా అవసరమని.. వాటన్నిటిని ఉపయోగించాలంటే జెట్టీలు కచ్చితంగా ఉండాలని మత్స్యకారులు చెబుతున్నారు. గత్యంతరం లేకనే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నామని చెబుతున్నారు. మూడేళ్లలో 2 ఫిషింగ్ హార్బర్లు కట్టి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్న జగన్ హామీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో వేట భారంగా మారిందని.. తుపాన్ల ముప్పుతో కనీసం వలలు ఇతర సామగ్రి దాచుకునేందుకు కనీస సదుపాయాలు లేవని మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10వేల సాయం కూడా అతి కొద్దిమందికే జమ అవుతోందని అంటున్నారు. తమ వర్గానికే చెందిన మంత్రి అప్పలరాజు మత్స్యకారులను అసలు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: