కరోనా వైరస్... శ్రీకాకుళం జిల్లాను తాకింది. పాతపట్నం మండలం కాగువాడలో ఒకే కుంటుబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దిల్లీ మెట్రో రైలు ఉద్యోగి మార్చి 17న దిల్లీ నుంచి కాగువాడకు వచ్చాడు. లాక్డౌన్ కారణంగా కాగువాడలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దిల్లీ నుంచి వచ్చిన ఆ వ్యక్తిని ఆశా కార్యకర్త వైద్య పరీక్షల నిమిత్తం పాతపట్నం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతనికి కరోనా వచ్చిందనే అనుమానంతో అతని నుంచి సేకరించిన నమూనాలు శ్రీకాకుళం పంపించారు. ఆ వ్యక్తికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఇదిలావుంటే అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా.. వారికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావటంతో వారందర్నీ ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికారులు అప్రతమత్తమయ్యారు. కాగువాడతో పాటు సీది గ్రామాలకు 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న 27 గ్రామాలను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.
స్పందించిన కలెక్టర్
జిల్లాలో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో స్పందించిన కలెక్టర్ జే నివాస్... ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న 29 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. మరొకరి రిపోర్టు కాకినాడ నుంచి రావాల్సి ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. కంటైన్మెంట్ జోన్లో ఉండే ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు