ETV Bharat / state

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

author img

By

Published : Jun 4, 2021, 10:07 AM IST

Updated : Jun 5, 2021, 5:36 AM IST

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

10:05 June 04

కాళీపట్నం రామారావు కన్నుమూత

కథలే ఆయనకు ప్రాణం. కథల సంపుటి ఆవిష్కరణలంటే ఎంత దూరమైనా వెళ్లడం ఆయన నైజం. రాసినంత కాలం కథలు రాసి, తర్వాత తెలుగు కథలన్నీ ఒకచోటికి చేర్చేందుకు తపన పడ్డారు. కథలతోనే సావాసం చేసి...అవే ఊపిరిగా బతికిన సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు (97) మరో లోకానికి మరలిపోయారు. అందరూ ‘కారా’ మాస్టారు అని ఆప్యాయంగా పిలుచుకునే సాహితీ దిగ్గజం కానరాని లోకాలకు వెళ్లిపోయారు. వయోభారంతో వచ్చిన సమస్యలతో ఏడాదిగా బాధపడుతున్న కాళీపట్నం రామారావు.. శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం ఉదయం 8.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రామారావు భార్య సీతామహాలక్ష్మి 2013లో మరణించారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం. ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కారా మాస్టారి మృతికి సాహితీ లోకం ఘన నివాళి అర్పించింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులూ సంతాపం తెలిపారు.

ఆరో తరగతి తప్పి..
కారా మాస్టారి అసలు పేరు కాళీపట్నం వేంకట సూర్య రామ సుబ్రహ్మణ్యేశ్వరరావు. 1924 నవంబరు 9న శ్రీకాకుళం జిల్లా పొందూరులో జన్మించారు. తల్లిదండ్రులు భ్రమరాంబ, పేర్రాజు లావేరు మండలం మురపాకలో నివాసం ఉండేవారు. నాలుగో తరగతి వరకూ రామారావు అక్కడే చదువుకున్నారు. ఆరో తరగతిలోనే బడి ఎగ్గొట్టి ఆటలాడుకోవటంతో పరీక్ష తప్పారు. దీంతో కారాను ఆయన తండ్రి శ్రీకాకుళంలోని చక్రపాణి వెంకట్రావు అనే హయ్యర్‌గ్రేడ్‌ ఉపాధ్యాయుడికి అప్పగించారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. పదో తరగతి పాసయినా.. తర్వాత చదువు ముందుకు సాగకపోవడంతో కారా స్వగ్రామం మురపాకకు తిరిగివెళ్లారు. అప్పుడే రామకృష్ణ గ్రంథాలయంలోని పుస్తకాలతో సాన్నిహిత్యం ఏర్పడింది. 14వ ఏటనే ముద్దు అనే కథ, ఒకట్రెండు పద్యాలూ రాశారు. 1941, 42లో చదివిన పుస్తకాల ప్రభావం ఆయనపై చాలా ఎక్కువగా పడింది. సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో రెండుసార్లు ఇల్లు వదిలి మళ్లీ తిరిగొచ్చారు. ఎంత అన్వేషించినా సత్యాన్ని తెలుసుకోలేకపోయాననుకుని ఆత్మహత్యాయత్నం చేసి విఫలమయ్యారు. 1943 సెప్టెంబర్‌ 1న చిత్రగుప్తలో కార్డు కథలు శీర్షికతో ఆయన రాసిన ‘ప్లాటుఫారమో’ రచన ప్రచురితమైంది. రామారావు రచనల్లో తొలి ముద్రణ అదే.  

కారా మాస్టారి మానసపుత్రిక ‘కథానిలయం’
శ్రీకాకుళం నగరంలోని విశాఖ-ఎ కాలనీలో ఓ రెండంతస్తుల భవనం. తెలుగు కథలన్నింటినీ ఒకచోటికి చేర్చేందుకు కాళీపట్నం రామారావు మాస్టారు పడిన శ్రమకు అది నిలువుటద్దం. ప్రతి తెలుగు కథనూ కథానిలయానికి చేర్చేందుకు తన జీవితాన్నే ధారపోసిన ఆయన సంకల్పానికి తిరుగులేని సాక్ష్యం. నాటి గురజాడ నుంచి నేటి యువ రచయితల వరకు వేల మంది తెలుగు రచయితల కథలన్నీ కొలువుదీరిన ఆ కథల కాణాచి.. ‘కథానిలయం’.
1993లో అనంతపురంలో జరిగిన ఒక సభలో కారా మాస్టారు.. తోటి కథకులతో మాట్లాడుతున్నప్పుడు ఒక కథల గ్రంథాలయం ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అది మనసులో ముద్రించుకున్న మాస్టారు 1995-96లో రూ.1.5 లక్షలతో ‘కథానిలయం’ భవనానికి శంకుస్థాపన చేశారు. తొలినాళ్లలో పురస్కారాలను తిరస్కరించిన ఆయన.. తర్వాత వాటిని స్వీకరిస్తూ వచ్చిన నగదునంతా కథానిలయానికి వెచ్చించారు. కథపై వచ్చిన ప్రతి పైసానూ దానికే ఖర్చు పెట్టారు. సాహితీవేత్తలు, కథాభిమానులు అందించిన సహకారంతో కథానిలయాన్ని పూర్తి చేశారు. తొమ్మిది మంది సభ్యులతో ట్రస్టు ఏర్పాటు చేసి, కథానిలయంపై హక్కులన్నీ ట్రస్టు బోర్డుకే కట్టబెట్టారు.  

 లక్ష కథలకు కొలువు
కథానిలయం స్థాపించినప్పుడు కారా వ్యక్తిగత గ్రంథాలయం నుంచి తెచ్చిన 800 పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఆయన కృషి, రచయితలు, సాహిత్య అభిమానుల సాయంతో ఇప్పుడు అక్కడున్న కథలు.. అక్షరాలా లక్షకు పైనే. 25 వేల పైగా కథల పుస్తకాలు, మరో 25 వేల పైగా పత్రికా సంచికలు ఉన్నాయి. కథలు, కథకు సంబంధించిన వ్యాసాలు, పరిశోధక రచనలు కథానిలయంలో కొలువుదీరాయి. ఆధునిక రచయితలూ తమ కథల సంపుటిలను ఇక్కడికి పంపుతుంటారు. ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, రచయితలు, కథకులు, ఔత్సాహికులు కథానిలయం సందర్శనకు వస్తుంటారు. కథలు ఎలా రాయాలో కారా మాస్టారు తన కథల్లోనే వివరించారు. వాటిని చదివి రచయితలుగా మారిన ఎందరో తమ రచనలను కథానిలయంలోనే ఆవిష్కరించారు. 2009లోనే కథల పుస్తకాల డిజిటలైజేషన్‌కు కారా శ్రీకారం చుట్టారు. ఎవరు ఎక్కడి నుంచైనా కథానిలయం.కామ్‌ వెబ్‌సైట్లోకి వెళ్లి నచ్చిన కథను డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు.

కథ ఆయన శ్వాస

రామారావు వృత్తిరీత్యా విశాఖలో ఎక్కువ కాలం నివాసమున్నారు. పలు ఉద్యోగాలు చేశారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని 1948లో సెయింట్ ఆంథోనీ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1955 వరకూ కథలు రాసినా అవి సంతృప్తి ఇవ్వలేదు. తరువాత దాదాపు ఎనిమిదేళ్లు రచనలకు విరామం ఇచ్చారు. మళ్లీ 1963లో ‘తీర్పు’ కథతో కలాన్ని పరుగులు పెట్టించారు. 1979లో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. పదిహేనేళ్ల కిందట వరకూ రామారావు తన రచనలను కొనసాగించారు. కొన్ని కథలు ఆంగ్లం, రష్యన్‌ భాషల్లోకీ అనువాదమయ్యాయి. 1993లో అమెరికాలో జరిగిన తానా తెలుగు మహాసభలకు కారా మాస్టారు అతిథిగా హాజరయ్యారు. ఇతర రచయితల లఘుకథల సేకరణ, ముద్రణలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ రచనా వ్యాసంగం ప్రారంభానికీ ఆయనే స్ఫూర్తి. అందుకే రామారావును ఆయన తన గురువుగా అభివర్ణిస్తారు. విప్లవ రచయితల సంఘంలో కార్యనిర్వాహక సభ్యుడిగా కారా వ్యవహరించారు. ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ విశేష మన్ననలు పొందింది. 1971లో ‘యజ్ఞంతో తొమ్మిది కథలు’ కథా సంపుటిని వెలువరించారు. దీనికి 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 

తెలుగు సాహిత్యానికి వన్నెలద్దారు

‘కారా మాస్టారి కథలు తెలుగు సాహిత్యానికి వన్నెలద్ది జాతీయ స్థాయి గౌరవాన్ని అందించాయి. కథానిలయం సంస్థ ద్వారా ఆయన తెలుగు కథకు ఉన్నతి కల్పించారు. సామాన్య పాఠకుల గుండెలకు సైతం హత్తుకునేలా సాగిన కారా మాస్టారి రచనా పరంపర భావ ప్రాధాన్యతతో ముందుకు సాగింది’.

- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అసంఖ్యాక అభిమానుల్లో ఒకరిగా నివాళి అర్పిస్తున్నా

‘అట్టడుగు, మధ్య తరగతి వర్గాల జీవితాలకు అద్దం పట్టేలా, వాస్తవికతను ప్రతిబింబించే రచనలు చేసి తెలుగు పాఠకులను కారా మాస్టారు తట్టిలేపారు. సాహిత్య అకాడమీ అవార్డుకే వన్నె తెచ్చారు. అసంఖ్యాక అభిమానుల్లో ఒకరిగా, రామారావు మాస్టారు స్మృతికి నివాళి అర్పిస్తున్నా’

- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఇదీ చదవండి: 

తెలుగుతో పాటు 10 ప్రాంతీయ భాషల్లో కొవిన్

Last Updated : Jun 5, 2021, 5:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.