Best Personal Finance Books : జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలంటే కచ్చితంగా ఫైనాన్సియల్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే సరైన విధానంలో పొదుపు, మదుపు చేయగలుగుతాం. ఊహించని ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు సరైన ఆరోగ్య, జీవిత బీమాలను ఎంచుకోగలుగుతాం. వీటితోపాటు నిత్యావసరాలకు, అత్యవసరాలకు మాత్రమే డబ్బులు ఖర్చు చేసి, దుబారా ఖర్చులను నియంత్రించగలుగుతాం. ఈ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ తెలిసినవారు కచ్చితంగా తమ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించగలుగుతారు. మరి మీరు కూడా ఇలానే చేసి, జీవితంలో బాగా డబ్బు సంపాదించి, ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ జీవితానికి బాగా ఉపయోగపడే 10 ముఖ్యమైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. The Total Money Makeover : డేవ్ రామ్సే రాసిన 'ది టోటల్ మనీ మేక్ఓవర్' ఒక గొప్ప పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం. దీనిలో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు సంబంధించిన నిజ జీవిత ఉదాహరణలు, ప్రేరణ కలిగించే అంశాలు, సలహాలు, సూచనలు ఉంటాయి. చాలా మంది తాము సంపాదించిన డబ్బుపై నియంత్రణ తెచ్చుకోలేరు. ఆర్థిక లక్ష్యాలను సాధించలేక, ప్రతీ దానికి కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఇలాంటి వారు తమ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది.
2. You're So Money: Live Rice, Even When You're Not : ఫర్నూష్ తొరాబి రాసిన చాలా మంచి పుస్తకం ఇది. చాలా సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను, బడ్జెట్ రూపకల్పనను చాలా సులువుగా, అందరికీ అర్థమయ్యే రీతిలో రాశారు ఆమె.
వ్యక్తులు తాము అమితంగా ఇష్టపడే వాటి కోసం, ఏ విధంగా ఖర్చు చేయాలి అనే విషయాలను రచయిత్రి ఈ పుస్తకంలో రాశారు. సాధారణంగా పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలు చాలా బోరింగ్‌గా ఉంటాయి. కానీ ఫర్నూష్ తొరాబి ఈ పుస్తకాన్ని (హ్యూమరస్‌గా) హాస్యం జనించేలా రాశారు. తాను చెప్పదలుచుకున్న విషయాలను చాలా ఆకర్షణీయంగా, సూటిగా, శక్తివంతంగా వివరించారు. కనుక పాఠకులు ఒకే సమయంలో ఆనందాన్ని, విజ్ఞానాన్ని పొందేందుకు అనువుగా ఈ పుస్తకం ఉంటుంది.
మనుషులు అతి పిసినారితనంతో ఉండకూడదని ఫర్నూష్ తొరాబి అంటారు. ధనవంతులుగా జీవించడం, ధనవంతునిగా మరణించడంలో ఉన్న ఆనందం గురించి ఆమె చాలా నిక్కచ్చిగా ఈ పుస్తకంలో రాశారు.
3. I Will Teach You To Be Rich : 20 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ యువకులు రమిత్ సేథి రాసిన ఈ పుస్తకాన్ని కచ్చితంగా చదవాలి. ఈ ప్రస్తకం సంపద సృష్టి (వెల్త్ క్రియేషన్) గురించి, పర్సనల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ గురించి తెలియజేస్తుంది. ఈ పుస్తకం ప్రధానంగా బడ్జెట్ వేయడం, పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం, బ్యాంకింగ్ కార్యకలాపాలు చేయడం లాంటి కీలకమైన వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అంశాలను ప్రాక్టికల్‌గా చెబుతుంది.
4. Rich Dad Poor Dad : రాబర్ట్ కియోసాకి రాసిన మోస్ట్ పాపులర్ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. ఈ పుస్తకంలో పేదవాళ్లు ఎలా ఆలోచిస్తారు. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు అనే విషయాలను చెప్పారు. మనిషి అనేవాడు పేదవాడిగా బతకడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని రాబర్ట్ కియోసాకి నిక్కచ్చిగా చెబుతారు. అంతేకాదు బిజినెస్ పాఠాలు నేర్చుకుని, జీవితంలో ఎలా పైకి ఎదగాలో చాలా ప్రాక్టికల్‌గా తెలియజేశారు రాబర్ట్ కియోసాకి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లు, భారీ ఆర్థిక లక్ష్యాలు ఉన్నవారు ఈ పుస్తకాన్ని చదవడం మంచిది.
5. The Millionaire Next Door : థామస్ స్టాన్లీ, విలియం డాంకో రాసిన గొప్ప పుస్తకం 'ది మిలయనీర్ నెక్ట్స్ డోర్'. ఈ పుస్తకంలో అమెరికాకు చెందిన పలువురు మిలియనీర్ల గురించి, వారి అలవాట్లు గురించి తెలియజేశారు. ఐశ్వర్యవంతులు ఏ విధంగా సంపద సృష్టిస్తారో కూడా చాలా క్లియర్‌గా ఇందులో వివరించారు.
చాలా మంది మిలియనీర్లు చాలా లో ప్రొఫైల్‌లో ఉంటారు. వారి గురించి మీడియాకుగానీ, ప్రపంచానికి గానీ తెలియకుండా ఉంచుతారు. కానీ తమదైన రీతిలో బిజినెస్ చేసి కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారో ఈ పుస్తకంలో చాలా క్లియర్‌గా వివరించారు.
6. Your Money Or Your Life : విక్కీ రాబిన్ రాసిన ఈ పుస్తకం పర్సనల్ ఫైనాన్స్ గురించే కాదు, జీవితం గురించి, ఆదర్శాల గురించి కూడా తెలియజేస్తుంది. డబ్బు సంపాదించడం ముఖ్యమే గానీ, అందుకోసం సహజ సంపదను నాశనం చేయకూడదని ఆయన అంటారు. ఈ భూగ్రహం మీద ఉన్న పరిమితమైన వనరులను అత్యాశతో దుర్వినియోగం చేయకూడదని ఆయన నిక్కచ్చిగా చెబుతారు. అలాగే అనవసర ఆర్భాటపు ఖర్చులు తగ్గించుకుని, పొదుపుగా, సంతోషంగా ఎలా జీవించాలో ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకంలో వివరించిన తొమ్మిది-దశల విధానం మనం ఆర్థిక స్వేచ్ఛ సాధించడానికి అవసరమైన మార్గాన్ని చూపిస్తుంది.
7. The Little Book Of Common Sense Investing : ఈటీఎఫ్ బిజినెస్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన వాన్గార్డ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాన్ సీ. బోగ్లే రాసిన గొప్ప పర్సనల్ ఫైనాన్స్ బుక్ ఇది. ఈ పుస్తకంలో ఇండెక్స్ ఇన్వెస్టింగ్, స్టాక్ సెలక్టింగ్ స్ట్రాటజీస్, ఇన్వెస్ట్మెంట్ ఫండమెంటల్స్ గురించి వివరించారు. అంతేకాదు ప్రాక్టికల్‌గా మీ పోర్ట్‌ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో తెలియజేశారు.
8. The One-Page Financial Plan : కార్ల్ రిచర్డ్స్ రాసిన ఈ పుస్తకంలో మీ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించాలో క్లియర్‌గా వివరించారు. ఈ పుస్తకాన్ని ఆర్థమయ్యే భాషలో చాలా సరళంగా రాశారు. అంటే దీనిలో క్లిష్టమైన ఆర్థిక పదజాలం (ఫైనాన్సియల్ జార్గాన్) ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవవచ్చు.
9. You Need A Budget : జెస్సీ మీచం రాసిన ఈ పుస్తకం వ్యక్తిగత బడ్జెట్ రూపకల్పన గురించి చక్కగా వివరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు, తమ జీవనశైలిని ఏమాత్రం మార్చుకోకుండానే, చాలా చక్కగా ఆర్థిక వ్యవహారాలు ఎలా నడపవచ్చో ఈ పుస్తకంలో జెస్సీ రాశారు. ఆదాయం తక్కువగా వస్తున్నప్పటికీ అప్పుల భారాన్ని ఎలా తగ్గించుకోవాలి. భవిష్యత్ కోసం ఎలా పొదుపు చేయాలి అనే విషయాలను చాలా సింపుల్‌గా ఈ పుస్తకంలో వివరించారు రచయిత.
10. The Motley Fool. You Have More Than You Think : "ది మోట్లీ ఫూల్. యూ హావ్ మోర్ దాన్ యూ థింక్" అనే ఈ పుస్తకాన్ని డేవిడ్ గార్డనర్, టామ్ గార్డనర్ అనే ఇద్దరు రచయితలు కలిసి రాశారు. మీ ఆర్థిక పరిస్థితులను, జీవిత లక్ష్యాలను ఎలా సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ పుస్తకం చెబుతుంది. అలాగే అప్పులు తగ్గించుకుని, పొదుపు పెంచుకునే మార్గాలను చాలా సులువైన పద్ధతిలో వివరిస్తుంది. అంతేకాదు ఎలాంటి నష్టభయం లేకుండా, లాభాలు సంపాదించే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి కూడా వివరిస్తుంది.
మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary
ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? భార్యాభర్తలు పాటించాల్సిన టాప్-9 ఫైనాన్సియల్ టిప్స్ ఇవే!