శ్రీకాకుళం జిల్లాలో ‘కరోనా’ ఆర్థిక సాయం అందని పేదలకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బియ్యం కార్డులకు (మ్యాపింగ్ చేసినవి), రేషన్‌కార్డుల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున వేలాది మంది ఆర్థిక సాయానికి దూరమయ్యారు. పౌరసరఫరాలశాఖ గణాంకాల ఆధారంగా కాకుండా వాలంటీర్లు మ్యాపింగ్ చేసిన కార్డుల ఆధారంగా ప్రభుత్వం తొలుత నిధులు మంజూరు చేసింది. దీనిపై అందరికీ ఆర్థిక సాయం అందని వైనంపై ‘ఈనాడు’లో ఈ నెల 12వ తేదీన ‘వెళ్లిపోతున్నాయ్..‘సాయం’ కాలాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
జిల్లాలో రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ ఆర్థిక సాయం అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన అంశాన్ని గుర్తు చేసింది. దీనిపై యంత్రాంగం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. రేషన్‌కార్డు ఉండి సాయం అందని జాబితాలను సిద్ధం చేసింది. జిల్లాలో 929 సచివాలయాల వారీగా జాబితాలు పంపింది. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి ఆర్థిక సాయం అందించాలని కోరింది.
మిగులు నిధులతో తొలుత సర్దుబాటు
నిధులు మంజూరైనా వేలాది మంది అందుబాటులో లేనందున వారికి ఆర్థిక సాయం చేరువ చేయలేక పోయారు. 7,49,252 కార్డులకు సంబంధించి రూ.74.92 కోట్లు సచివాలయాలకు మంజూరయ్యాయి. వీటిలో ఈ నెల 14వ తేదీ వరకు 7,02,152 కుటుంబాలకు రూ.70.21 కోట్లు అందజేశారు. మరో రూ.4.71 కోట్ల మేర నిధులు మిగిలాయి. ఇప్పుడు సాయం పంపిణీ చేయాల్సిన కార్డులకు సంబంధించి రూ.4.41 కోట్లు మాత్రమే అవసరమని గుర్తించారు.
అలా నిధులు అందుబాటులో ఉన్నందున వీరందరికీ సర్దుబాటు చేయాలని ఆదేశాలు అందాయి. కొన్ని సచివాలయాల్లో పూర్తి స్థాయిలో నిధులు ఖర్చయిపోతే.. వీరికి వెంటనే సర్దుబాటు చేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు కావటంతో.. ఒకటి రెండు రోజుల్లో నిధులు సర్దుబాటు చేసేలా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే నిధులు మంజూరై అందుబాటలో లేని కార్డుదారులు తిరిగి స్వగ్రామాలకు చేరితే వారికి కూడా సాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అర్హులందరికీ చెల్లింపులు చేస్తాం
'అర్హులైన అందరికీ కరోనా సాయం అందిస్తాం. ఈ మేరకు అదేశాలు వచ్చాయి. గతంలో మంజూరైన నిధుల్లో చెల్లించగా మిగిలిన పైకాన్ని తాజా చెల్లింపులకు వినియోగిస్తాం. అప్పటికీ చాలకపోతే నిధులు సర్దుబాటు చేస్తాం. మంగళవారం బ్యాంకులకు సెలవు అయినందున ఒకటి రెండు రోజుల్లో సొమ్ములు జమ చేస్తాం.'--- భాసూరి శంకరరావు, ఎంపీడీవో, రాజాం
* జిల్లాలో మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య: 8.29 లక్షలు (సుమారు)
* తొలిదశలో కరోనా ఆర్థిక సాయం మంజూరైన కార్డులు: 7,50,631
* కేటాయించిన నిధులు: రూ.75.06 కోట్లు
* సచివాలయాలకు నిధులు వచ్చిన కార్డుల సంఖ్య: 7,49,252
* మంజూరైన నిధులు: రూ.74.92 కోట్లు
* ఇంత వరకు సాయం అందిన కార్డులు: 7,02,152
* లబ్ధిదారులకు అందిన నగదు సాయం: రూ.70.21 కోట్లు
ఇవీ చదవండి: