కరోనాను అడ్డుకునేందుకు అన్ని శాఖల అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అతి కొద్ది మంది మినహా.. దాదాపుగా ప్రజలంతా సహకారం అందిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు, లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాటినీ అధిగమిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుంది. లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం వరకు 23 పాజిటివ్ కేసులు ఉండగా.. మంగళవారం ఒక్కసారిగా 4 కేసులు పెరిగి 27కి చేరాయి. కరోనా తీవ్రత గురించి తెలిసినా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముంది. నిత్యావసరాల కోసం దుకాణాలు, మార్కెట్లు, తాత్కాలిక రైతు బజార్లు, రేషన్ దుకాణాలకు వచ్చేవారు కొందరు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. తద్వారా వైరస్ వ్యాపించేందుకు అవకాశం ఉంది. ఇలాకాకుండా నిత్యావసర సరకులు, కూరగాయలను ఇళ్లకే అందిస్తే ఉపయోగంగా ఉంటుందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనిపై జిల్లా అధికారులు ప్రణాళికలు రచించినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోలేదు.
సంరక్షణ పరికరాలు అవసరం
కరోనా వ్యాప్తి నిరోధానికి విశేష కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, గ్లౌజులు ఇస్తున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి సంరక్షణ పరికరాలున్నాయి. పాజిటివ్ నిర్ధరణ అయిన వారితో సంబంధమున్న పలువురు జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. వారి దగ్గరకు వెళ్లాలన్నా వైద్యులు, సిబ్బందికి పీపీఈలు, మాస్క్‌లు, ఇతర సంరక్షణ పరికరాలు అవసరం. వాటిని అరకొరగా ఇస్తున్నారనే ఆరోపణ వినిపిస్తోంది. ఈ విషయమై కలెక్టర్ ముత్యాలరాజును వివరణ కోరగా సంరక్షణ పరికరాలు అవసరానికి సరిపడా ఉన్నాయన్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి: